ముందస్తుకు వెళ్తే..
టీఆర్‌ఎస్ ఓడటం ఖాయం
– ప్రగతి నివేదన సభకాదు.. పుత్రుడి నివేదిక సభ
– రాష్ట్ర బడ్జెట్ అంతా కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉంది
– తండ్రీకొడుకులు అబద్దాల్లో పోటీపడుతున్నారు
– ఇంటింటికి నల్లా కనెక్షన్ చూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్3(జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తు ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయమని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చిట్టికథలు చెప్పేందుకు పనికొస్తారని, పాలనకు కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్, కేటీఆర్ పోటీ పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ రక్తం చిందకుండా తెలంగాణ తెచ్చిన అంటున్నావ్.. నువ్వు పార్టీ పెట్టిన ఆరు ఏండ్లకు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాడు.. ఆ తరువాత కవిత బతుకమ్మ అంటూ దిగింది.. కానీ తెలంగాణ కోసం 1200 మంది ఆత్మార్పణం చేసుకున్నారు.. మరి విూ ఇంటి నుంచి ఒక్కరైనా శ్మశానానికి పోయారా అంటూ రేవంత్ మండిపడ్డారు. ఆదివారం జరిగింది ప్రగతి నివేదన సభ కాదని.. పుత్రుడి నివేదిక సభగా.. తెలంగాణ ప్రజలపై దండయాత్రగా రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేటీఆర్.. నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా లేదంటే మెత్త పెట్టి ఒత్తి చంపాలా అంటూ తండ్రిని బెదిరిస్తున్నాడని, అందుకే కొడుకును మభ్యపెట్టడానికి కేసీఆర్ ముందస్తని హడావుడి చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమైక్య పాలనలో తీసుకువచ్చిన పథకాలను కేసీఆర్ తనవిగా చెప్పుకుంటూ బీరాలు పోతున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో, కేసీఆర్ చేసింది ఏం లేదని ఆయన విమర్శించారు. పేదలు చచ్చినంత కాలం బర్లు, గొర్లు మేపుకుంటూ ఉంటే.. విూ కుటుంబం మాత్రం రాజ్యమేలుతూ ఉండలా అంటూ ప్రశ్నించారు. సామాజిక న్యాయం అంటే కేసీఆర్ తన కుంటుంబానికి మాత్రమే న్యాయం చేయడం అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి కోసం 1200 మంది ఆత్మార్పణం చేస్తే వారి వివరాలు సేకరించడానికి విూకు 51 నెలల సమయ కూడా సరిపోలేదా అంటూ ప్రశ్నించారు. విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉంటేనే తట్టుకోలేని కేసీఆర్ హరికృష్ణకు స్మారకచిహ్నం కడతాను అన్నాడంటే ఓట్ల కోసం ఏంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడో అర్దం చేసుకోవచ్చంటూ రేవంత్ విమర్శించారు. ప్రగతి నివేదన సభలో కేటీఆర్, హరీష్ రావ్, కేసీఆర్, కవిత మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అందుకే ఆయనలో ఇంతకు ముందున్న ఆత్మ విశ్వాసం, వాడి, వేడీ తగ్గాయని తెలిపారు.10వేల కోట్ల అంచనా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్లకు పెంచిన కేసీఆర్.. ఇంటింటికి నల్లా కనేక్షన్ చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి సవాలు చేశారు.



