ములుగు జిల్లాలో కుండపోత

` బొగత జలపాతం వద్ద ముంచెతుతున్న వరద
` రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
ములుగు,హైదరాబాద్‌(జనంసాక్షి):ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో.. బొగత జలపాతం కనువిందు చేస్తోంది. అయితే.. బొగత జలపాతం ఉన్న ములుగు అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలపాత సందర్శన సురక్షితం కాదని అటవీ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు. బొగత జలపాతం దగ్గరకు రావొద్దని సూచించారు. జులై 26 వరకూ బొగత జలపాత సందర్శనపై తాత్కాలిక నిషేధం విధించారు. బొగత జలపాతం సందర్శనపై తాత్కాలిక నిషేధం విధించిన అటవీ శాఖ అధికారులు ముత్యాలధార, కొంగల, మామిడిలొద్ది, కృష్ణపురంలో ఉన్న జలపాతాల సందర్శనపై శాశ్వత నిషేధం విధించడం గమనార్హం.బొగత జలపాతం వరంగల్‌ నుంచి 140 కిలోవిూటర్ల దూరంలో ఉంది. వాజేడు మండల పరిధిలో ములుగు పట్టణానికి 90 కిలోవిూటర్ల దూరంలో బొగత జలపాతం ఉంది. అయితే.. కాస్త వర్షాలు తగ్గాక జలపాతం అందాలను చూసేందుకు వెళ్లడం మంచిదని అన్నారు. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలను వాతావరణ శాఖ ఇంకా హై అలర్ట్‌లోనే పెట్టింది. ఆ రెండు జిల్లాల్లో గురువారం కూడా అతిభారీ వర్షాలు కురిసాయి. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అయితే, పరిస్థితులను బట్టి అది రెడ్‌ అలర్ట్‌ కిందకూ మారే అవకాశాలూ లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. బుధవారం ఉదయం 8.30 వరకే ములుగు జిల్లా వెంకటాపురంలో 25.5 సెంటీ-విూటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా ఏటూరు నాగారంలో 18.5, మంగపేటలో 15.9, ఆలుబాకలో 14.9 సెంటీ-విూటర్ల వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి కూడా అత్యంత భారీ వర్షాలు కురిశాయి.బుధవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు అక్కడ 21.5 సెంటీ-విూటర్ల వర్షపాతం రికార్డు అయింది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో 23.3 సెం.విూ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 12 సెం.విూ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రవీంద్ర నగర్‌లో 10.7, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 10.5, ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాలలో 10.2, ములుగు జిల్లా ఆలుబాకలో 10.1, కరీంనగర్‌ లో 9.3, గంగిపల్లిలో 7.5, భద్రాద్రి జిల్లా మణుగూరులో 7 సెంటీ-విూటర్ల చొప్పున వర్షం పడిరది.
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడిరచింది.అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వాన పడుతుందని పేర్కొంది. ఇవాళ(గురువారం) జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.శుక్రవారం ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.