మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే..

మేము ఎన్డీఏలో కొనసాగం :నితీష్‌
పాట్నా, ఆగస్టు 14 (జనంసాక్షి) :
ప్రస్తుత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎన్డీఏ 2014లో ప్రధాని అభ్యర్థిగా నిర్ణయిస్తే తాము ఎన్డీఏలో కొనసాగే ప్రసక్తే లేదని బీహార్‌ ముఖ్య మంత్రి నితీష్‌ కుమార్‌ తేల్చి చెప్పారు. పాట్నాలో స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జెండావిష్కరణ చేసిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు గతంలో ప్రధాని అభ్యర్థిగా మోడీని వ్యతిరేకించిన మీరు, భవిష్యత్తులోనూ అదే మాట మీదుంటారా.. ఒకవేళ ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోడీనే ప్రక టిస్తే మీరు ఎలా స్పందిస్తారని నితీష్‌ను ప్రశ్నిం చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఎన్డీఏ మోడీయే తమ ప్రధాని అభ్యర్థి అని ప్రకటిస్తే, ఆ వెంటనే తాము ఎన్డీఏలో నుంచి వైదొలుగుతామని స్పష్టం చేశారు. వేరే ప్రత్యామ్నాయం దిశగా తమ చర్యలుంటాయని వెల్లడించారు. పూర్తిగా మతతత్వ వాది అయిన మోడీ నాయకత్వాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని మోడీ స్పష్టం చేశారు. కానీ, మీరు గతంలో చేసిన ప్రకటన తర్వాత కూడా మోడీతో కలిసి వేదికపై చేతులెత్తారు కదా అని విలేకరులు ప్రశ్నించగా, అది మోడీ బలవంతం మీద చేశాను గానీ తన విధానాలు నచ్చి కాదని నితీష్‌ వివరించారు.