రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలి: బైరెడ్డి

అనంతపురం: తరతరాలుగా రాయలసీమ వాసులు మోసపోతూనే ఉన్నారు. అన్నింటిని వదులుకున్నారు. ఇక్కడి ప్రజలకు జరిగిన అన్యాయంపై బహిరంగ చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్వవస్ధాపకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మంత్రులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో సామవారం రాయలసీమ ఉనికి ప్రశ్నార్ధకమేనా అనే అంశంపై సీమ స్థాయి మేధావులు, విద్యార్థుల సదస్సు జరిగింది. సదస్సుకు ఆయన ముఖ్యఅలతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజిస్తే మూడు ప్రాంతాలు వేరుచేయాలని, లేదంటే ఒక్కటిగానే ఉంచాలన్నారు. రాయలసీమ వాసులు ఇప్పటికే రాజధాని వదులుకున్నారు, ప్రాజెక్టులు కోల్పోయారన్నారు. శ్రీబాగ్‌, మెకంజీ ప్లాన్‌ అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ పరిస్థితి ఏమిటన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా కేంద్ర బిందువు కాగా ప్రత్యేక రాయలసీమకు ఎస్కేయూ ఆయువు పట్టు కావాలన్నారు.