రిమ్స్‌లో సౌకర్యాలు ఏవీ? ప్రజలకు ఉపయోగపడని కళాశాల

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిమ్స్‌ కళాశాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 20 లక్షల జనాభా ఉన్నప్పటికీ రిమ్స్‌ కళాశాల ఎలాంటి వసతులు లేకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అండంలేదు. 2004 సంవత్సరంలో 120 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన ఈ వైద్య కళాశాల 8 సంవత్సరాలు అవుతున్నా భవన సముదాయాలు పూర్తి కాక, ఇటు సరైన వైద్యులు లేక ప్రజలకు వైద్య సేవలు అందకపోవడంతో ప్రతి చిన్న జబ్బులకు హైదరాబాద్‌, మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ కళాశాలతో పాటు కడపలో ప్రారంభమైన రిమ్స్‌ కళాశాల పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆదిలాబాద్‌ రిమ్స్‌ కళాశాల నిర్మాణం ఇంత వరకు పూర్తి కాలేదు.  ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కాని,  ఇటు జిల్లా యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలకు శాపంగా మారింది. పేరుకు మాత్రమే రిమ్స్‌ కళాశాల ఉందని, రిమ్స్‌ కళాశాలలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రిమ్స్‌ కళాశాలలో అన్ని విభాగాలకు కలిపి మొత్తం 150 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 90 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కీలక మైన విభాగాలలో వైద్యులు లేక పేద ప్రజలకు వైద్యం అందడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స చేయకపోవడంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతూ మహారాష్ట్రలోని నాగపూర్‌,యావత్‌మల్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు కొద్ది పాటి వైద్యం కూడా అందడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి సరైన సమయంలో వేతనాలు చెల్లించకపోవడంతో తరుచుగా విధులను బహిష్కరించడంతో ప్రజలకు వైద్య సేవలందడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికైనా వెనుకబడిన జిల్లా ప్రజలకు ఆదునిక వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, రిమ్స్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.