రైతులకు మద్దతుగా ఆందోళన
అఖిల పక్షరైతుల సంఘాల రాస్తారోకో
హైదరాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి.దిల్లీలో రైతులపై నిర్బంధానికి వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపు మేరకు హైదరాబాద్-గోల్కొండ క్రాస్‌రోడ్డు వద్ద రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వీరికి కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఏఐకేఎస్‌సీసీ ప్రతినిధులు తీగల సాగర్, బి.వెంకట్ తదితరులు మద్దతు తెలిపారు. రైతుల ఉద్యమం పట్ల కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు ఆరోపించాయి.వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాలకు భిన్నంగా మోదీ సర్కారు కార్పోరేట్లకు అనుకూలంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించాయి. ఇప్పటికైనా కేంద్రం స్పందించి మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు సవరించుకోకపోతే ఈ నెల 5న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతుల సంఘాలు హెచ్చరించాయి. రైతుల ఆందోళనలో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు అందోళనకారులను అరెస్టు చేశారు.