ల్యాంకో భూములను వెనక్కి లాక్కోండి

– ఎమ్మార్‌, ఇన్ఫోసిస్‌కు చెందినవి కూడా
– వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు
– ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి
– సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా ఆగ్రహం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌ మణికొండలో ల్యాంకో, ఎమ్మార్‌, ఇన్ఫోసిస్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టిన వక్ఫ్‌ బోర్డుకు చెందిన విలువైన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా డిమాండ్‌ చేశారు. ఈ భూముల రికవరీ కోసం జరుగుతున్న న్యాయపోరాటంలో వక్ఫ్‌ బోర్డు, ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. శనివారం మఖ్దూం భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణికొండలో భూములపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. ఆ భూముల్లో ప్రస్తుతం ఉన్న కట్టడాలు యథావిధిగా ఉండొచ్చని, ట్రిబ్యునల్‌ ఇచ్చే తుది తీర్పు ఆధారంగా వాటిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం పేర్కొందని ఆయన వివరించారు. అయితే, స్టే వెకెట్‌కు సంబంధించి వక్ఫ్‌ బోర్డ్ణు దాఖలు చేసేందుకు వక్ఫ్‌ బోర్డు తయారు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ సమగ్రంగా లేదని, ఆందులో అనేక ముఖ్యమైన అంశాలు లోపించాయన్నారు. మణికొండలో 1898.18 ఎకరాల భూమి షావలి దర్గాకు 1935లోనే రిజిస్టర్‌ చేశారని, ఒకసారి భూములు వక్ఫ్‌ బోర్డుకు రిజిస్టర్‌ అయితే అవి ఎన్నాళ్లకైనా బోర్డుకే చెందుతాయని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పును అజీజ్‌ పాషా గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా వక్ఫ్‌ బోర్డుకు చెందిన వేల ఎకరాల భూమిని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పనంగా ధారాదత్తం చేశారని విమర్శించారు. పాతబస్తీలో నివసించే పేద ముస్లింలు, దళిత, బీసీలకు సెంటు భూమిని కూడా ఇవ్వని ప్రభుత్వం బడా కంపెనీలకు మాత్రం కేటాయిస్తున్నదని ఆరోపించారు. అదే విధంగా పహాడీ షరీఫ్‌, విశాఖలో కూడా ఇలాగే వక్ఫ్‌ ఆస్తులను కంపెనీలకు కట్టబెట్టారన్నారు. వెంటనే కబ్జాకు గురైన భూములను వెనక్కి తీసుకోవాలని, న్యాయపోరాటం కోసం సీనియర్‌ న్యాయవాదులను నియమించాలని అజీజ్‌ పాషా డిమాండ్‌ చేశారు. లేకుంటే, సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.