వచ్చే నెల 9న అవినీతిపై మహా ఉద్యమం : రాందేవ్‌

హైదరాబాద్‌ : వచ్చే నెల 9వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలనపై మహా ఉద్యమం చేపట్టనున్నట్లు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్న రామ్‌దేవ్‌ బాబాకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘనం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ ఉద్యమంలో అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. అవినీతి నిర్మూలనతోపాటు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును వెలికి తీయాలన్నా తక్షణమే సీబీఐని లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా దానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని బాబా రాందేవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అవినీతి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు కూడగట్టే క్రమంలో ఇక్కడికి వచ్చానని, సోమవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుడుతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలను కలుసుకోనున్నట్టు ఆయన తెలిపారు.