వరుసగా మూడోసారి వారణాసిలో మోడీ నామినేషన్‌


` హాజరైన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, సీఎం యోగి
` ఎన్డిఏ నుంచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరు
` కాశీతో నా అనుబంధం ప్రత్యేకం: మోడీ
వారణాసి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిటింగ్‌ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్‌ వేశారు. కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా.. ఉదయం జిల్లా మెజిస్టేట్ర్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ స్థానం నుంచి ప్రధాని వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్‌ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్‌ వద్ద ప్రధాని పూజలు నిర్వహించారు. అక్కడే క్రూజ్‌ షిప్‌లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం యోగితో కలిసి మోదీ.. ఆరు కిలోవిూటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. రాత్రి ఇక్కడే బస చేశారు. నామినేషన్‌ నిమిత్తం మోదీ పర్యటన ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యవేక్షించారు. ఆ పార్టీ సీనియర్‌ నేత సునీల్‌ బన్సల్‌ చాలా రోజుల నుంచి వారణాసిలో ఉండి పనులను చక్కబెట్టారు. ఇక, ఈ రోజు ఉదయం మోదీ ’ఎక్స్‌’ వేదికగా ఒక ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేశారు. కాశీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఏడో విడతలో జూన్‌ ఒకటిన ఈ స్థానానికి పోలింగ్‌ జరగనుండగా.. నామినేషన్‌ దాఖలు చేయడానికి గడువు నేటితో ముగియనుంది. ఇక్కడ ప్రధానిపై కాంగ్రెస్‌ నుంచి యూపీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ నిలబడిన సంగతి తెలిసిందే. మోదీపై ఈయన పోటీ చేయడం వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 2014లో ప్రధాని తొలిసారి ఇక్కడ పోటీ చేయగా.. 56శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్‌ రాయ్‌కి కేవలం 75వేల ఓట్లు దక్కాయి. ఆమ్‌ ఆద్మీ తరఫున అరవింద్‌ కేజీవ్రాల్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక, 2019 ఎన్నికల్లో ప్రధానికి 63 శాతం ఓట్లు రాగా.. అజయ్‌రాయ్‌కి 14శాతం ఓట్లు దక్కాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌ సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. వరసగా మూడోసారి ఇక్కడి నుంచి మోదీ బరిలోకి దిగారు. 2019, 2014లో కూడా వారణాసి నుంచి మోదీ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ వేసిన తర్వాత రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వారణాసిలో లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి పోటీచేస్తున్న నరేంద్ర మోదీ సోమవారం ఆరు కిలోవిూటర్ల మేర పట్టణంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. విద్యా రంగ సంస్కర్త మదన్‌మోహన్‌ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి యాత్రను ప్రారంభించారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్దఎత్తున గుమిగూడి రోడ్‌షోకు స్వాగతం పలికారు. నరేంద్రమోదీపై పూలవర్షం కురిపించారు.
కాశీతో నా అనుబంధం ప్రత్యేకం:మోడీ
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతున్న క్రమంలో సోమవారం 4వ దశ ఎన్నికలు ముగిసాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగం మరో కీలక ఘట్టానికి తెర లేచింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాశిలో నామినేషన్‌ వేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమిలోని పార్టీల అధినేతలకు ఆహ్వానం అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాని హాజరయ్యారు. మరికొన్ని గంటల్లో నామినేషన్‌ దాఖలు చేయనున్న క్రమంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్‌ చేశారు. వారణాసితో తనకు ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ వీడియోను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ వీడియోలో మోదీ తొలిసారి వారణాసిని ఎప్పుడు సందర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని ఎలా ప్రారంభించారు. లాంటి వివరాలను పేర్కొన్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారణాసి రూపురేఖలు ఎలా మారాయన్న విషయాన్ని ఇందులో సవివరంగా వివరించారు. ఇక వీడియోతో పాటు నరేంద్ర మోదీ.. ’కాశీతో నా అనుబంధం అద్భుతమైంది. సమగ్రమైంది, సాటిలేనిది. ఈ భావాన్ని మాటల్లో వ్యక్తీకరించలేను’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.