విత్తనాల కొనుగోళ్లలో ఇక పారదర్శక విధానం

నేరుగా రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ
హైదరాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): ప్రతీయేటా రైతులకు వివిధ రకాల సబ్సిడీల పేరిట కేటాయిస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి రైతుకు చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీ రూపంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.500కోట్లు రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో విత్తనాలు కొనుగోలు చేసి వాటిని సబ్సిడీ ధరపై రైతాంగానికి అందజేస్తారు. ప్రధానంగా ప్రతీ సంవత్సరం వ్యవసాయ శాఖ ద్వారా వరి, వేరుశనగ, శనగ, సోయాబీన్‌, పచ్చిరొట్ట తదితర విత్తనాలను రైతాంగానికి 33శాతం సబ్సిడీపై సరఫరా అవుతాయి. ఈ విత్తనాల సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సుమారు రూ.200కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ విత్తన సబ్సిడీలను కొందరు కాజేస్తున్నారనే ఆరోపణలతో మరింత పారదర్శకంగా విత్తనాల సబ్సిడీని అందించేందుకు ప్రభుత్వం సిద్‌ధ్దమవుతుంది. ఇందుకుగాను డీబీటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీబీటీ విధానాన్ని వ్యవసాయ యంత్ర పరికరాలకు అందజేసే సబ్సిడీకి సైతం విస్తరించేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95శాతం సబ్సిడీ, ఇతరులకు 50శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేస్తుంది. వివిధ పథకాల కింద సబ్సిడీ శాతంలో తేడా ఉన్నది. యంత్ర పరికరాల విషయంలో రైతులు సైతం తమకు నచ్చిన కంపెనీ యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ సబ్సిడీ డబ్బులు ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే బిడ్లలో పాల్గొని అర్హత సాధించిన కంపెనీల నుంచే రైతులు యంత్రాలను కొనుగోలు చేయాలి. రైతులు యంత్రాలు కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలోకి చేరుకుంటుంది. రాష్ట్రంలో సుమారు రూ.300కోట్ల సబ్సిడీ యంత్ర పరికరాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ప్రతీ రూపాయి రైతులకు నేరుగా చేరాలనే ఉద్దేశంతో సబ్సిడీ డబ్బులను వారి ఖాతాలలో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మరోవైపు అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుపుతుంది. ప్రభుత్వపరంగా ప్రతీ సంవత్సరం రైతాంగానికి విత్తనాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ ఇస్తున్నారు.  ఇందుకుగాను రైతులకు 33శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయబడతాయి. తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి సర్టిఫికెట్‌ పొందినటువంటి విత్తనాలను రైతులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎంతమేరకు
రైతులకు అవసరమనే విషయంలో వారి భూ విస్తీర్ణం ఆధారంగా విత్తన కొనుగోలు చేపడితే, ఆయా విత్తనాలపై సబ్సిడీ డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వ ధ్రువీకరణ లేని విత్తనాలు కొనుగోలు చేస్తే ఈ సబ్సిడీ ఇవ్వడం
జరగదు. బయటి మార్కెట్‌లో రైతులు కొనుగోలు చేసేటటువంటి విత్తనాల్లో నాణ్యతా లోపం, కల్తీతో రైతులే నష్టపోతారు. ప్రభుత్వం గుర్తించిన సంస్థల ద్వారా కొనుగోలు చేస్తే మరింత నాణ్యమైన విత్తనాలు
రైతాంగానికి అందే అవకాశాలు ఉంటాయి. ఈ నిబంధనలకు అనుగుణంగానే రైతులుకు సబ్సిడీ డబ్బులు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. దీంతో నకిలీలను కూడా అరికట్టాలని చూస్తున్నారు.