విద్యుత్ కోతలున్నా మెట్రోకు అంతరాయం లేని విద్యుత్
హైదరాబాద్ : మన మెట్రో రైలుకు అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక వేళా.. కరెంట్ కట్ అయినా క్షణాల్లో వచ్చేలా పనులు చేసిపెట్టారు. ప్రయాణికుల భద్రతకు మాది పూచి అంటున్నారు మెట్రో అధికారులు. విద్యుత్ కోతలున్నా.. సరఫరాలో అంతరాయం ఏర్పడినా సురక్షితంగా గమ్యానికి చేరుస్తామంటున్నారు. మెట్రోకు రోజుకు 7.63 లక్షల యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది. 28. 63 లక్షల యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. కాబట్టి కరెంట్ కట్‌కు అస్కారమే లేదని హెచ్‌ఎంఆర్ అధికారులు అంటున్నారు.
సబ్‌స్టేషన్ల అనుసంధానం
అంతరాయం లేని విద్యుత్‌ను సరఫరా కోసం, ఏదైనా అంతరాయం ఏర్పడినా.. క్షణాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్ సబ్‌స్టేషన్లన్నింటినీ ఒకదానితో మరొకదానికి అనుసంధానం చేస్తున్నారు. ఒక సబ్‌స్టేషన్ విఫలమైన మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది.
మెట్రోకు 125 మెగావాట్ల విద్యుత్..
మెట్రోరైలు ప్రాజెక్ట్ అవసరాల కోసం 125 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు జరిగాయి. ఈ విద్యుత్‌ను తెలంగాణ ట్రాన్స్‌కో సరఫరా చేయనుంది. కరెంట్‌ను 132 కేవీ సబ్‌స్టేషన్ల ద్వారా అందించనున్నారు. మూడు కారిడార్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా కోసం ఉప్పల్, మియాపూర్ యూసుఫ్‌గూడ, ఎంజీబీఎస్ స్టేషన్ల సమీపంలో నాలుగు రిసీవింగ్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ రిసీవింగ్ సబ్‌స్టేషన్లలో ఏయిర్ ఇన్సూలేటెడ్ సబ్‌స్టేషన్లు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్లు, అగ్జిలరీ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ రిసీవింగ్ సబ్‌స్టేషన్ సిద్ధం కాగా, మియాపూర్, యూసుఫ్‌గూడ రిసీవింగ్ సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికప్పుడు ప్రాజెక్ట్ కోసం 3 కారిడార్లలోని 72 కిలోమీటర్లకు రోజుకు 7.63 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించనున్నారు. 2025 వరకు అవసరమయ్యే విద్యుత్ ఇప్పుటి నుంచే అందుబాటులోకి తెలిపారు.
దేనికదే విడివిడి లైన్లు ..
ప్రాజెక్ట్‌లో విద్యుత్ సరఫరాను, ట్రాక్షన్ పర్పస్ (రైళ్లు నడపడం కోసం), ఆగ్జిలరీ సర్వీసెస్ (స్టేషన్లు, డిపోలు, ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్) ద్వారా అందించనున్నారు. వీటికోసం ప్రత్యేకంగా విద్యుత్ లైన్లను నిర్మిస్తున్నారు. ఇలా దేనికదే విడివిడిగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరాలో లోపాలను నివారించవచ్చు.
ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు ఇలా…
అగ్జిలరీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ : 132/33 కేవీ
ట్రాక్షన్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ : 132/25 కేవీ
అగ్జిలరీ టాన్స్‌ఫార్మర్ : 33/415 వోల్టేజ్
రింగ్ మేయిన్ నెట్‌వర్క్: 33 కేవీ విద్యుత్ కేబుల్
రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా 30 శాతం ఆదా..
ప్రాజెక్ట్‌లో సాధ్యమైనంత మేరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తయారు చేసిన మెట్రోబోగీల్లో రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా 30 శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ప్రాజెక్ట్ ప్రారంభం కానున్న 2014- 15లో కేవలం 520 లక్షల యూనిట్లను వినియోగించుకోనుండగా, 2023- 24కు గాను 28.65 లక్షల యూనిట్లను ప్రాజెక్ట్ వినియోగించుకోనుంది.