విమర్శలు మానకుంటే వారికే నష్టం: చారి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. కాంగ్రెస్‌ ఆశయాలకు అనుగుణంగానే కోదండరామ్‌ విమర్శలు ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఎత్తి చూపాలని,సవరించు కునే వీలుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వారు చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ నాయకులు, ప్రొఫెసర్‌ కోదండరాం నిత్యం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలనలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి.. సరిదిద్దుకుంటాం కానీ, పనిగట్టుకొని ఆరోపణలు, లేనిపోని ప్రచారాలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మరో 20 ఏండ్లు తిరుగులేదని పేర్కొన్నారు. ప్రగతినివేదన సభతో వీరికి చెమటలు పడుతున్నాయని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌తోపాటు వారి కుటుంబంపై ప్రతిపక్షాలు వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని, వారి వైఖరి మార్చుకోవాలని సూచించారు.