వీధి కుక్కల స్వైరవిహారం

గర్జిస్తున్న గ్రామ సింహాలు
– భయాందోళనలో స్థానికులు
– పట్టించుకోని అధికారులు, పాలకులు
చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : చేర్యాల ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. అదమరిచి వాహనాలపై వెళ్లే వారిని కుక్కలు వెంబడిస్తున్నాయని మండల ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు కరవడం వలన రేబీస్‌ వ్యాధి సోకుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వీధి కుక్కలు రోడ్లపై, కాలనీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసిన గుంపులుగా తిరుగుతున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్న వారిపై విరుచుకుపడుతున్నాయి. ఇలా రోజుకో గ్రామంలో కుక్క కాటుతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క రోడ్డుపై వాహనాలకు అడ్డం రావడం కారణంగా అనేక ప్రమాదాలు జరిగి మనుషుల కాళ్లు, చేతులు విరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు నెలకొన్నాయి. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్‌ పోయిన సమయంలో భయంతో రోడ్లపై నడిచేందుకు ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. కనీసం అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుండి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, వెటర్నరీ అధికారులు,ప్రజాప్రతినిధులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేర్యాల పట్టణం, గర్జకుంట క్రాస్ రోడ్డు, ఆకునూర్, ముస్త్యాల తదితర గ్రామాల్లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న కుక్కలను ఎప్పటికప్పడు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, వెటర్నిటి విభాగం సిబ్బంది పట్టుకుని వీధి కుక్కల బెడద నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.