వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :
ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుఫున గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో వారు పదవీ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలంతా ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం కోలాహలంగా మారిపోయింది. ఎమ్మెల్యేల అనుచరులు, అభిమానులు పార్టీ కార్యాలయానికి తరలిరావడంతో సందడి కనిపించింది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న వైఎస్‌ విజయమ్మకు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విజయమ్మ అధ్యక్షతన పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలతో భేటీ జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సలహాదారుడు, వైవీ సోమయాజులు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు ఎంవీ మైసురారెడ్డి పార్టీ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి, పార్టీ కోశాధికారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, కార్యాలయ సమన్వయకర్త ప్రసాద్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో వైఎస్‌ విగ్రహానికి విజయమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ భేటీ అనంతరం ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి బయలుదేరారు.
పార్టీ ప్రచార కన్వీనర్‌ విజయచందర్‌, కేంద్ర కమిటీ సభ్యులు గట్టు రామచంద్రారావు, బాజిరెడ్డి గోవర్దన్‌, సత్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ వేగిరాజు రామకృష్ణరాజు అధికార ప్రతినిధి చంద్రమౌళి, మీడియా కోఆర్డినేటర్‌ రమణ, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వెంకటరమణ, అచ్యుతరామారావు, పార్టీ కార్యాలయంలో విజయమ్మను, సుబ్బారెడ్డిని కలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకులు కె. శ్రీనివాస్‌రెడ్డి, నీలాధర్‌రెడ్డి, రామకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా నుంచి తీసుకువచ్చిన స్వీట్లను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు. విజయోత్సవ సంబరాలను నిర్వహించారు.