వ్యవసాయరంగంపై కేంద్రం తీరు అమానుషం

వ్వయసాయ నిపుణుల సూచనలు పట్టించుకోవడం లేదు
ఫసల్‌ బీమా అంతా బోగస్‌ అంటూ మండిపాటు
కౌలు రైతులను ధరణిలో తొలగించామని పునరుద్ఘాటన
రైతుల భూమికి ఎసరు పెట్టవద్దనే నిర్ణయం
అసెంబ్లీలో మరోమారు కేంద్రం తీరుపై మండిపడ్డ కెసిఆర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌8 (జనంసాక్షి) : వ్యవసాయ రంగంపై కేంద్రం అవలంభిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయ నిపుణలు సూచనలు,సలహాలను పట్టించుకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమాపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఫసల్‌ బీమా కానీ, మన్ను బీమా కానీ, ఏదన్నా కానీ అదంతా వట్టి బోగస్‌ అని ధ్వజమెత్తారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. స్వామినాథన్‌, అశోక్‌ గులాటి లాంటి వారు వ్యవసాయ రంగంలో మార్పులపై కేంద్రానికి రెకమెండ్‌ చేశారు. వారి నివేదికలను కేంద్రం పట్టించుకోలేదు. రైతులు అప్పుల కోసం వెళ్తే ప్రీమియం కట్టించుకుంటున్నారు. కేంద్రం పెట్టిన విధానాలు సరిగా లేవు. దేశంలో ఫసల్‌ బీమా యోజన శాస్త్రీయంగా లేదు. దేశంలో ఫసల్‌ బీమా యోజనతో రైతులకు లాభం చేకూరట్లేదు. ఫసల్‌ బీమా యోజనపై కేంద్రానికి సూచనలు పంపుతాం. కేంద్రాన్ని మేం విమర్శించడం.. వారు మమ్మల్ని విమర్శించడం సరికాదన్నారు. దేశానికి బాధ్యత వహిస్తున్న కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆహార ధాన్యాల కొరత రాకుండా శీతల గోదాములు నిర్మించాలి. శీతల గోదాములు నిర్మించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంటుంది. ఆహార ధాన్యాల కొరతే ఏర్పడితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. వరి ధాన్యం మేం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. చాలా నష్టం జరిగింది. వరదల వల్ల వివిధ ప్రాంతాల్లో రూ. 8 వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపాం. కేంద్రం నుంచి స్పందన లేదు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ జరిగితే కొంత డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. కేంద్రం దీనిపై స్పందించడం లేదు. పరిహారం కింద కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు. నష్టం అంచనాలపై రెండు రకాల నివేదికలు పంపుతారు. తాత్కాలిక అంచనాను కేంద్రానికి పంపిస్తాం. తక్షణ సహాయం కోసం తాత్కాలిక నివేదిక పంపుతారు. నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపుతారు. కానీ ఆ బృందం ఆలస్యంగా వచ్చి పర్యటిస్తోంది. అంతవరకే రెండో పంట కూడా చేతికి వస్తుంది. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఇంత వరకు కేంద్ర బృందం పర్యటించలేదు అని సీఎం పేర్కొన్నారు. ఇకపోతే కౌలు రైతుల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులను పట్టించుకుంటే అసలు రైతులకే మోసం వస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.గతంలో రైతుల భూములను అతిచిన్న స్థాయి అధికారులు చాలా అరాకిరి చేశారు. తెలంగాణలో భూముల విలువ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పారదర్శకత కోసం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చాం. ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు చాలా ఉపశమనం వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ లాంటి ఘట నలు జరగకుండా ధరణి తెచ్చాం. ధరణి పోర్టల్‌లో అనేక లక్షలాది రిజిస్టేష్రన్లు జరుగుతున్నాయి. భూమిని కాపాడుకునే రైతును కౌలు రైతు పేరు విూద బలిచేయదలుచుకోలేదు. ధరణి పోర్టల్‌లో ఆ కాలమ్స్‌ తొలగిం చాం. కౌలు అనేది ప్రయివేటు వ్యవహారం. ఇది ఆ రైతుకు, కౌలు రైతుకు మధ్య ఉన్న ఒప్పందం.
కౌలుదారు మారినప్పుడల్లా ప్రభుత్వాలు రికార్డులను మార్చాలంటే కుదరదు. అది ప్రభుత్వం పని కాదు. కౌలు రైతుల విషయాన్ని తాము పట్టించుకోము. కౌలురైతుల పట్ల మాకు మానవీయత ఉంది. కానీ అసలు రైతు నష్టపోవొద్దు అనేది మా పాలసీ. అసలు రైతులు తమ భూములను వారసత్వంగా కాపాడుకుం టున్నారు. అసలు రైతులకు కష్టాలు వస్తే ఉపవాసమైనా ఉంటారు కానీ.. భూములను అమ్ముకోరు. అలా కాపాడుకున్న భూమిని కొందరు పైరవీకారుల వల్ల గద్దల్లా తన్నుకుపోయే పరిస్థితి ఉండొద్దని, రైతుల సంక్షేమం దృష్ట్యా కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. కౌలు రైతులను పట్టించుకుంటే అసలు రైతులకు మోసం వస్తుంది. ఒక వేళ కౌలు రైతులు నష్టపోతే.. తప్పకుండా వారిని మానవీయ కోణంలో ఆదుకుంటాం. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములకు రైతుబంధు ఇవ్వకుండే. కానీ తర్వాత ఆ భూములకు పట్టా ఉండటంతో 3 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నాం. రైతాంగానికి మంచి పనులు చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. కౌలు రైతులు, గిరిజన రైతులు నష్టపోతే.. వందో, రెండు వందల కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదన్నారు. అయితే కౌలు రైతులకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామన్నారు. వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలు దెబ్బ తిన్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ మంథని, మధిర నియోజకవర్గ ల్లో వదల కారణంగా పంటలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. 2015లో మాత్రమే పంటకు ఇన్‌ఫుట్‌ సప్సీడీ ఇచ్చామని… తప్పితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. పంట నష్టం విూద అంచనా వేసి కేంద్రనికి పంపితే ఎంతోకొంత సహాయం అందుతుందని చెప్పారు. 52శాతం రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారని… వారికి రైతు బంధు రావడం లేదు కాబట్టి కనీసం నష్ట పరిహారం అయినా ప్రభుత్వం ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.