శరవేగంగా సవిూకృత కలెక్టరేట్ల నిర్మాణం

త్వరలోనే పూర్తి కానున్న భవనాలు

కొత్త జిల్లాల్లో తీరనున్న సమస్యలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. ఇప్పటికే అవి పూర్తిగా ఉనికిని సాధించాయి. అన్ని కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట నిర్మాణం కానున్నాయి. గతేడాది సవిూకృత భవానాలకు భూమిపూజలు జరిగాయి. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాల్లో కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ.. కొద్ది రోజుల్లోనే శాశ్వత భవన సముదాయం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భారీ అంచనా వ్యయంతో కార్యాలయాల సముదాయం నిర్మాణానికి సంబంధించిన నిర్మాణాలు చేస్తున్నారు. మరికొంత కాలం తాత్కాలిక భవనాల్లో నుంచి కార్యకలాపాలు జరగనున్నాయి. అలాగే నిధులు కూడా విడుదల కావడంతో శాశ్వతంగా భవనాల నిర్మాణానికి సంబంధించిన పక్రియ శరవవేగంగా సాగుతోంది. స్థలాల సేకరణతో పాటు, కొత్త భవన సముదాయం ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి డిజైన్లు కూడా ఖరారు చేయడం చకచకా సాగిపోవడంతో పనులు కూడా అంతే వేగంగా సాగుతున్నాయి. ఈ దసరాకు జిల్లాల ఏర్పాటు రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోనుంది. దీంతో పలు రకాల ఆధునిక వసతులతో కొత్త జిల్లా శాశ్వత భవన సముదాయం నిర్మాణం కానుంది. అధికారులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగని విధంగా ఇక్కడ అన్ని రకాల వసతులు సమకూరనున్నాయి. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కలెక్టరేట్‌తో పాటు కొన్ని జిల్లా కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా మరికొన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అధికారులతో పాటు, ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలతో పాటు, పాత కేంద్రాల్లో కూడా అధునాతన హంగులతో కొత్త భవన సముదాయం అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అందరికి అందుబాటులో ఉండేలా భవన సముదాయం ఉండే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలిచ్చారు. అన్ని జిల్లాల్లో అధునాతన హంగులు, అన్ని రకాల వసతులు, విశాలంగా కార్యాలయాలు, అందరికి అనుకూలంగా ఉండేలా భవన సముదాయం డిజైన్‌ కోసం ఆర్కిటెక్ట్‌కు బాధ్యతలు అప్పగించారు. కొత్తగా నిర్మించే సవిూకృత భవన సముదాయ ప్రాంగణం ఆహ్లాదకర వాతవరణంలో ఉండే విధంగా తీర్చిదిద్దనున్నారు. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలతోపాటు, అక్కడ విధులు నిర్వహించే అధికారులు, ఇతర ఉద్యోగులకు వసతులు సమకూర్చనున్నారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్‌ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. సమావేశాలు నిర్వహించుకోవటానికి అనుకూలంగా ఉండే విధంగా విశాలమైన పెద్ద హాలు నిర్మాణం చేస్తారు. ఇతర జిల్లా కార్యాలయాలుకూడా ఒకే గూడుకిందకు చేరుతాయి.