శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు

హైదరాబాద్‌,నవంబరు 27 ( జనం సాక్షి ) : శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగాయి. కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తాయి. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గంగాధర మండపం, ఉత్తర శివమాఢ వీధిలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో మల్లికార్జుని దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. ధర్మపురిలో గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కాళేశ్వరం, యాదాద్రి ఆలయాల్లో కూడా రద్దీ కొనసాగింది.