సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఆందోల్ సస్యశ్యామలం – మంత్రి హరీష్ రావు

మునిపల్లి, జూన్ 07, జనంసాక్షి : సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఆందోల్ నియోజకవర్గం సస్యాశామలం అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక్క ఆందోల్ నియోజకవర్గంలోనే 2 లక్షల 19 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చిన్నచెల్మెడ గ్రామంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి సంగమేశ్వర పంప్ హౌస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులు ఎవ్వరు ఆందోళన చెందవద్దని తెలిపారు. రైతులకు దగ్గరుండి తాను, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నష్ట పరిహారం డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. రూ. 2,653 కోట్లతో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులను రెండుమూడు ఏళ్లల్లో పూర్తి చేస్తామన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర పంప్ హౌస్ ల నిర్మాణం పూర్తి అయితే సంగారెడ్డి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గతంలో ఆందోల్ నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించామన్నారు. దాదాపు అన్ని గ్రామాలల్లో బీటీ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి అయిందన్నారు. జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ కూడా పడకలను పెంచాన్నారు. 500 పడకలతో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ, జహీరాబాద్ లో 100 పడకలకు పెంచామన్నారు. విద్యా, వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద పీటవేస్తున్నారని తెలిపారు. తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు అయన వెంట ఉండాలన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందుకే 60 ఏళ్ళల్లో జరగని అభివృద్ధి పది ఏళ్ళలో చేసుకున్నామని చెప్పారు.ఎందుకు వెనుకపడ్డాయి?ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలు వెనుకపడ్డ ప్రాంతాలు కావని వెనుకపడేయబడ్డ ప్రాంతాలు అన్నారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి మంత్రులు, ఉపముఖ్యమంత్రులు ఉన్న ఎందుకు ఈ ప్రాంతం ఇన్ని రోజులు నిర్లక్ష్యనికి గురయ్యిందో ప్రజల ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన సింగూర్ ప్రాజెక్ట్ ను హైదరాబాద్ కు కట్టబెడితే.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ద్వారా పంప్ హౌస్ ల నిర్మాణం చేసి మన నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలన ఆందోల్ నియోజకవర్గాన్ని పూర్తిగా వివక్షకు గురి చేసారని విమర్శించారు. ఇప్పుడు సింగూర్ ప్రాజెక్టు ద్వారా సంగమేశ్వర, బసవేశ్వర పంప్ హౌస్ లు నిర్మాణంతో తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా తీరుతాయాన్నారు.యువ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ఆందోల్ ఎమెల్యే క్రాంతి కిరణ్ స్థానికంగా ఉండి నియోజకవర్గానికి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నిరంతరం జనాల్లో ఉంటున్న క్రాంతి కిరణ్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలన్నారు. గతంలో ఉన్న నాయకులు కేవలం ఎన్నికల టైంలో మాత్రమే కనిపించేవారని హరీష్ రావు సెటైర్లు వేశారు. ఎన్ని దగ్గర పడుతున్నందున ఇప్పుడు అందరు వస్తారన్నారు. మీకోసం స్థానికంగా అందుబాటులో ఉంటూ పని చేస్తున్న యువ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను నియోజకవర్గ ప్రజలు మరోసారి గెలిపించుకోవాలని సూచించారు.సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కృషితో నీటీ కష్టాలు దూరం: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కృషితో నియోజకవర్గానికి అన్నివిధాలా అభివృద్ధి చేస్కుంటున్నామన్నారు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా మునిపల్లి, రాయికోడ్, బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో వట్ పల్లి, రేగోడ్ మండలాలకు సాగునీరు అందుతాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు గౌరవప్రధమైన పరిహారం చెల్లిస్తామని తెలిపారు. మన ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యం అన్నారు. త్వరలో భూసేకరణ పూర్తి చేస్తామని ఆందోల్ ఎమెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలో చెరువుల పూడికతీసి చెరువులు నింపడంతో పుల్కల్, ఆందోల్ లో 50 వేల ఎకరాలు సాగు అవుతుందన్నారు. సింగూర్ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన రైతులు ఇప్పటికీ తమనకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సంగమేశ్వర పంప్ హౌస్ నిర్మాణంతో తమ పొలాలకు నీళ్లు వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే రైతులు రెండు పంటలు పందించుకుంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల సంతోషంగా ఉన్నారని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గతంలో కరెంట్ కష్టాలు ఉంటే ఇప్పుడు 24 గంటల కరెంట్ రైతులకు అందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర నాయకులు నాయకులు మఠం బిక్షపాతి, జైపాల్ రెడ్డి, పైతర సాయికుమార్, జడ్పీటీసీ పైతర మీనాక్షి, ఎంపీపీ శైలజా, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పరుశురాం, చిన్నచెల్మెడ సర్పంచ్ విజయ్ భాస్కర్, ఉప సర్పంచ్ దత్తు గౌడ్, ఎంపీటీసీ రాజశేఖర్, తహసీల్దార్, ఎంపీడీఓ, సీఐ, ఎస్ఐ, సీనియర్ నాయకులు వెంకటేశం, అల్లాపురం నారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.