సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యం

కంటి వెలుగు లక్ష్యం అదేనన్న మంత్రి

పేదలకు ఇదో వరమని వ్యాఖ్యా

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కంటివెలుగు పథకాన్ని రూపొందించిందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేవామని అన్నారు. పీహెచ్‌సీల్లో ఆగస్టు 15న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. వయసుతోనిమిత్తం లేకుండా అన్నివర్గాల ప్రజలకు ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రాథమికంగా కంటిపరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీల్లో మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తారని పేర్కొన్నారు. పీహెచ్‌సీ డాక్టర్లు ఆ ప్రాంత శిబిరానికి లైజన్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని, క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్పెషల్‌ ఆఫీసర్లు తమవంతు సహకారం అందించాలని సూచించారు. కంటిపరీక్ష శిబిరానికి కావల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. శిబిరాల ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తించి, ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌, అంగన్‌వాడీ భవనాలు, వినియోగంలో లేని పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులను పరిశీలించాలన్నారు. ఇవి లేకపోతే ప్రైవేట్‌ బిల్డింగ్‌లలో ఏర్పాటు చేయాలని చెప్పారు. శిబిరం

నిర్వహించేందుకు అవసరమైన గదులు, నిరంతర విద్యుత్‌ సరఫరా, తాగునీటి వసతి కల్పించాలన్నారు.

రోజు ఏ గ్రామానికి సంబంధించిన ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారో ముందుగా గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ముద్రించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ శిబిరంలో వంద శాతం పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులందరికీ షెడ్యూల్‌ ప్రకారం కంటి పరీక్షలు నిర్వహించేలా సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. దీనిని డీఎంహెచ్‌వో కోఆర్డినేట్‌ చేయాలన్నారు.