సమగ్ర బాలల రక్షణకు తోడ్పడండి

కరీంనగర్‌, జూలై 23: 18 సంవత్సరాలలోపు పిల్లల రక్షణకు, హానికలగకుండా వారి హక్కుల పురోగతికి తోడ్పడేందుకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం అమలుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమగ్ర బాలల పరిరక్షణ పథకంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్రప్రభుత్వ సహకారంతో స్త్రీ శిశు సంక్షేమశాఖ, ఇతర శాఖల కింద బాలల రక్షణకు అమలు చేసే పథకాలన్ని ఒకే చోట సంఘటిత పరచి సమగ్రబాలల సంరక్షణ పథకం అమలు చేయుచున్నట్లు తెలిపారు. దోపిడీ, అవమానాల నుండి పిల్లలను కేవలం విముక్తి చేయడం ద్వారా మాత్రమే కాక వారి సంక్షేమానికి ఆహారం, వసతి, ఆరోగ్యం, విద్య పిల్లలకు అందుబాటులో తగిన జీవనస్థాయి ఉండేలా క్రియాత్మక చర్యలు చేపట్టడం ద్వారా బాలల సంక్షేమాన్ని సాధించడం ప్రధాన ధ్యేయంగా ఐసిపిమిస్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరాశ్రయులైన, వదిలి వేయబడిన, తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లలను చూసిన, తెలిసినా, తప్పిపోయి, ఇంటి నుండి పారిపోయిన పిల్లల గురించి, బాలకార్మికులు, వీధి బాలలు, బిక్షాటన పిల్లలు, బాల్యవివాహలు, లైంగిక వేధింపులు, మత్తు పదార్ధాలు, మత్తు పానియాలు సేవించే పిల్లలు గురించి తెలిస్తే అట్టి వారిని జిల్లా బాలల పరిరక్షణ కార్యాలయాల్లో చేర్పించాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, రాజీవ్‌ విద్యామిషన్‌, ఐసిపి, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, కార్మికశాఖ, స్త్రీశిశు సంక్షేమం, రవాణా పోలీస్‌, స్వచ్ఛందసంస్థలు బాలల హక్కులకోసం, అవసరాలు తీర్చడం రక్షణ, ఆదరణకు ఐసిపిమీస్‌కు సహకరించాలని ఆదేశించారు. సమగ్రబాలల సంరక్షణ పథకం అమలుపై వివిధ వివిధ శాఖలు ప్రత్యేకంగా తీసుకోవలసిన చర్యలపై సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో బాలల సంరక్షణ పథకం కింద 138 హోమ్‌ స్టడీలో, 83 మందికి కౌన్సెలింగ్‌ చేయడం, 62మందిని చిల్డ్రన్‌ హోంలలో చేర్చడం జరిగిందని జిల్లా బాలల సంరక్షణ అధికారి సర్వీస్‌ తెలిపారు. 34 మంది బాలల తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించామన్నారు. 7గురు బాలలకు బెయిల్‌, న్యాయసహయం చేసినట్లు ఆమె తెలిపారు. అదనపు జెసి సుందర్‌ అబ్నార్‌, బాలల సంక్షేమ కమిటి చైర్‌పర్సన్‌ జయశ్రీ, ఐకెపి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జె. శంకరయ్య, జిల్లా బాలల సంరక్షణ అధికారి సర్వీన్‌, జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య జువైనెల్‌ జస్టిస్‌ బోర్డ్‌ మెంబర్‌ మంజులవాణి, బాలల సంరక్షణ సమితి ప్రతినిధులు, రమేశ్‌, అధికారులు పాల్గొన్నారు.