సర్వాంగ సుందరంగా లాల్‌దర్వాజ ఆలయం
పారిశుద్యానికి ప్రత్యేక శ్రద్ద
హైదరాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి):లాల్‌దర్వాజ బోనాలు ఆదివారం జరుగనున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆషాఢ బోనాల జాతర మ¬త్సవాలకు మహంకాళి అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. రంగంలో భవిష్యవాణి కార్యక్రమం ప్రత్యక ఆకర్శణగా నిలుస్తుంది. నగరం నుంచే కాకుండా అనేక ప్రాంతాలనుంచి తరలిరానున్న భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ రెండురోజులు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు. ఈ వేడుకల్లో బోనాలు, ఘటాలు, సాక, ఫలహారపు బండ్ల ఊరేగింపు, రంగం, పోతరాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అనంతరం అంబారిపై అమ్మవారి సాగనంపు ప్రధాన ఘట్టాలుగా ఉంటాయి. అమ్మవారికి బోనాలు సమర్చించే మహిళల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని వివిధ రకాల పూలు, వేపాకు,పూల తోరణాలు,విద్యుత్ లైట్‌లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేవాలయం పరిసర ప్రాంతాలలో ఎనిమిది సెంటర్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల కొంగు బంగారం, కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దగ్గరుండి ఏర్పాట్లను
పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత బోనాలకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులుకేటాయించి అంగరంగ వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఉత్సవాల నిర్వహణలో బల్దియా ప్రధాన భూమిక పోషిస్తుంది. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టింది. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక శరద్ద తీసుకుంది. విద్యుత్తు ఇబ్బందులను అధిగమించేందుకు విద్యుత్తు విభాగం చర్యలు చేపట్టింది. ఆర్‌అండ్‌బీ అధికారులు క్యూలైన్లు, బ్యారికేడ్ల ఏర్పాటులో నిమగ్నమైంది. భక్తులను అలరించేందుకు సాంస్కృతిక కళా బృందాలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సిద్ధమవుతున్నాయి.
————



