సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి : పిఎసి

– ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతల అసంతృప్తి
హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ స్థాయి అవినీతి జరిగినట్లు ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) గుర్తించింది. కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పనులు, కాంట్రాక్టర్లకు ఇచ్చిన మొబలైజేషన్‌ అడ్వాన్సుల వివరాలపై సాగునీటి శాఖ అధికారులతో పిఎసి సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. టిడిపి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందంటూ పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన వివరణపై కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రతి ప్రాజెక్టులో మొబలూజేషన్‌ అడ్వాన్సుల కింద ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని సాగునీటి శాఖను కోరారు. దీనితో పాటుగా, ఆ రెండు ప్రాజెక్టులకు గడుపు దాటినా పనులు పూర్తి కాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్త పరిచారు. కల్వకుర్తి ప్రాజెక్టు అంచనా 2,773 కోట్ల రూపాయలు కాగా, ఇప్పటిదాకా ప్యాకేజి-1 కింద 2,100 కోట్లు రూపాయలు ఖర్చుచేశారు. అయినా 70 శాతానికి మించి పనులు పూర్తలేదు. అని పిఎసి సభ్యుడు, టిడిపి ఎమ్మెల్యే జి.జైపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. సమావేశం ముగిశాక, టిడిపి ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు విలేకర్లతో మాట్లాడారు. కల్వకుర్తి ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు మొబలైజేషన్‌ అడ్వాన్సుల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగినట్లు కమిటీ గుర్తించిందని జైపాల్‌ యాదవ్‌ చెప్పారు. కాంట్రాక్టర్ల కోసమే సాగునీటి శాఖ నడుస్తోందని దేవినేని ఆరోపించారు. 2009లో కూలిపోయిన నాణ్యతలేని నిర్మాణానికి బాధ్యుడైన కాంట్రాక్టర్‌కి కూడా కొందరు అధికారులు డబ్బు చెల్లించడం ఈ తప్పుడు చర్యలకు ఉదాహరణ అని అన్నారు. కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు కుమ్మక్కవడంతో పులిచింతల ప్రాజెక్టు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోందన్నారు. ఆ ప్రాజెక్టుకోసం ఒక కాంట్రాక్టర్‌కి అదనంగా 50 కోట్ల రూపాయలు చెల్లించారని కాగ్‌ నివేదిక ఎత్తి చూపిందని తెలిపారు. ఈ వ్యవహారాలపై కమిటీకి సమగ్ర నివేదిక సమర్పించాలని సాగునీటి శాఖ అధికారులను కోరామని ఆయన అన్నారు. కాగా, మూడు భిన్నమైన అంశాల్లో ప్రభుత్వం పనితీరుపై రాష్ట్ర కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి, అసెంబ్లీ సభా సంఘాల సమావేశాల వివరాలపై నివేదికను శాసన సభలో ప్రవేశపెట్టేదాకా, సభ్యులెవరూ మీడియాకు వెల్లడించకూడదు. కాని, ఎలాక్ట్రానిక్‌ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక, మరింత ప్రచారం పొందేందుకు కొందరు రాజకీయ నాయకులు ఆ నియమాలను గాలికొదిలేస్తున్నట్టు కనిపిస్తోంది.