సూర్యాపేట కాల్పుల కేసులో సీసీ కెమెరా దృశ్యాలు

నల్గొండ, ఏప్రిల్‌ 2 : సూర్యాపేట బస్టాండ్‌లో కాల్పులతో విరుచుకుపడి బీభత్సం సృష్టించిన దుండగుల ఘాతుకానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను ఏబీఎన్‌ సంపాదించింది. అయితే దుండగులు ముందస్తు ప్రణాళికతో సీసీ కెమెరాలు లేని చోటుకు పోలీసులను తీసుకెళ్లి కాల్పులకు తెగబడ్డారు. దాంతో కొన్ని దృశ్యాలు మాత్రమే రికార్డు అయ్యాయి. సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ సమీపంలోని సీసీ కెమెరాల్లో కాల్పుల దృశ్యాలు కెమెరాల్లో కనిపించాయి. తనకు బుల్లెట్‌ గాయం తగిలినా హోంగార్డు కిషోర్‌ ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లడం స్పష్టంగా దృశ్యాల్లో రికార్డు అయ్యింది. కాల్పుల ఘటనకు ముందు సీఐ మొగులయ్య కానిస్టేబుళ్లతో కలిసి బస్సులను తనిఖీ చేస్తున్న దృశ్యాలను కూడా ఏబీఎన్‌ సంపాదించింది. కాల్పులకు ముందు తర్వాత ఏం జరిగిందనే దానిపై ఈ దృశ్యాలను చూసి పోలీసులు విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.