హరితహారం లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
– ఇప్పటి వరకు 59శాతం లక్ష్యాలను సాధించాం
– 100శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
– ప్రతి మొక్కకు జియోట్యాగింగ్‌పై చేయాలి
– బతుకమ్మ చీరల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయండి
– కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ ఎస్‌కే జోషి
హైదరాబాద్, ఆగస్టు28(జనం సాక్షి) : తెలంగాణకు హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాల సాధనపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నిర్దేశించారు. మంగళవారం సీఎస్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు హరితహారం కింద 59శాతం లక్ష్యాలు సాధించడం జరిగిందని, నిర్దేశించిన సమయంలో 100శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. అలాగే మొక్కల జియో ట్యాగింగ్ పై కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. వచ్చే సంవత్సరం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించి గ్రామపంచాయతీలను సందర్శించి ప్రణాళిక రూపొందించాలన్నారు. ముఖ్యంగా గ్రామసభ ద్వారా ఏ గ్రామంలో ఎన్ని మొక్కలు అవసరం, ఎలాంటి మొక్కలు కావాలో ముందే ఇండెంట్ సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. మొక్కలకు అవసరమైన సంచులను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు వచ్చే సంవత్సరానికి సంబంధించిన నర్సరీల తయారీపై ముందుగానే అధికారులతో సవిూక్షించుకోవాలని చెప్పారు. చేనేత సవిూక్ష సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీపై మాట్లాడుతూ..గత సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీని జిల్లా కలెక్టర్లు విజయవంతంగా నిర్వహించినందుకుగాను జిల్లా కలెక్టర్లను ఆయన అభినందించారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చీరల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని సూచించారు. చీరల పంపిణీ తేదీలను తర్వాత తెలియజేస్తామన్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు పవర్ లూమ్ ద్వారాతయారైనవి మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క చీర ఖరీదు సుమారు 280 /-రూపాయల వరకు ఉంటుంది. వీటిని తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం పాలిస్టర్ జరీ బార్డర్, జాకెట్ తో సహా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చీరలన్నీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే తయారయ్యాయని సీఎస్ అన్నారు.
బతుకమ్మ చీరల నిలువకు గాను జిల్లాస్థాయిలో సెంట్రల్ గోదామును గుర్తించాలని, అలాగే గ్రామస్థాయిలో కూడా గోదాములను గుర్తించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. బతుకమ్మ చీరల పంపిణీకి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, చౌక ధర దుకాణం డీలరు, ఇద్దరు మహిళా సంఘ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే పట్టణ స్థాయిలో కూడా బిల్ కలెక్టర్, చౌక ధర దుకాణం డీలర్, ఇద్దరు మహిళా సంఘాల సభ్యులతో కమిటీ రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. చీరల పంపిణీపై గతంలో మాదిరి ఈ సంవత్సరం కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. బతుకమ్మ చీరలతో పాటు చేనేత జౌళి శాఖల ద్వారా అమలు చేసే పథకాలను ఈ సందర్భంగా ఆయన సవిూక్షించారు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల నిర్మాణం తదితరాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సవిూక్షించారు. జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సిఎస్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవిశాఖ) అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పి.కె ఝా, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, గ్రావిూణ అభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ హాజరుకాగా..జిల్లాల నుండి డిఎఫ్ జోజి, డి.ఆర్.డి.ఓ సుధాకర్, డీపీవో సురేష్ మోహన్, ఐటీడీఏ పీవో వెంకటయ్య, డీఎస్‌ఓ మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు.



