అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు నిలపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 : అంగన్‌వాడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి  ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్క్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు హైమవతి మాట్లాడుతూ, అంగన్‌వాడీ ఉద్యోగులపై స్పెషల్‌ అధికారుల వేధింపులు  రోజు రోజుకు అధికమవుతున్నాయి, వీటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీ ఉద్యోగులకు పిన్‌ కార్డులు ఇచ్చి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పని వివరాలు తెలపడం సిగ్గు చేటుచేటని ఆరోపించారు. కార్యాలయం ముట్టడి అనంతరం ఐసీడీఎస్‌ అధికారి ఇందిరకు వారు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ కార్యదర్శి రాజసులోచన, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, నగర కార్యదర్శి గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.