అంతరిక్షంలోకి  భారత వ్యోమగాములు

త్వరలోనే సాకారం కానున్న పరిశోధనలు
శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన తరవాత  ప్రపంచ దేశాలన్నీ మన అంతరిక్ష పరిశోధన సంస్థను కీర్తిస్తున్న వేళ చంద్రయాన్‌-2 విజయం ఇస్రో కీర్తిని ఇనుమడించేలా చేసింది. అనూహ్యంగా మనం అంతరిక్షంలో దూసుకుని పోతున్న తీరు ప్రపంచ దేశాల సరసన నిలబెట్టింది.  ఇప్పటిదాకా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిన అనుభవం లేదు మనకు. ఆ లోటూ త్వరలోనే తీరనుంది. మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపిక పక్రియా మొదలైపోయింది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో రష్యా, అమెరికా, చైనాల సరసన మనమూ చేరనున్నాం. ప్రయోగించే ప్రతి ఉపగ్రహానికీ ఒక వాహక నౌకను తయారు చేసుకోవడం అంటే, వేలకోట్ల రూపాయల వ్యవహారం. అది కూడా ఒక్కసారికే పనికొస్తుంది. అదే నౌకను వెనక్కి రప్పించుకుని, మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే – బొక్కసానికి భారం తగ్గుతుంది. అంతరిక్ష ప్రయోగాల వ్యయమూ ఎనభైశాతం మేర పడిపోతుంది. ఆ ఆలోచనతోనే… ఇస్రో పునర్వినియోగ వాహక నౌకను రూపొందించింది. ప్రయోగాత్మకంగా శ్రీహరికోట నుంచీ 65 కిలోవిూటర్ల ఎత్తు వరకూ పంపి, మళ్లీ వెనక్కి
తెప్పించింది. ఆ ఉత్సాహంతోనే ఈసారి ఇంకో అడుగు ముందుకేయబోతోంది.అంతరిక్ష రేసులో భారత్‌ అగ్రస్థానంలో దూసుకెళ్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా, రష్యా మధ్య ఉన్న స్పేస్‌వార్‌ ఇప్పుడు ఆసియాలో కనిపిస్తున్నదన్నా ఆశ్చర్యం లేదు. గతంలో రష్యా మాత్రమే అత్యధిక స్థాయిలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 2014లో 37 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రయోగించింది. ఇప్పుడు దానికి మూడు రెట్లు మన ఇస్రో ప్రయోగాన్ని పూర్తి చేసింది. భారత్‌తో పాటు చైనా, జపాన్‌ అంతరిక్ష సంస్థలు కూడా సాహసోపేతమైన అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధంఅవుతున్నాయి. గతంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అమెరికాతో పాటు కజకిస్తాన్‌, ఇజ్రాయిల్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యూఏఈ దేశాలకు చెందిన శాటిలైట్స్‌ ఉన్నాయి. ఒకేసారి అత్యధిక స్థాయిలో ఉపగ్రహాలను పంపడం వల్ల ఖర్చు సుమారు 60 నుంచి 70 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దశాబ్దం చివర వరకు చైనా కూడా అంతరిక్ష అద్భుతానికి సన్నాహాలు చేస్తున్నది. చైనా ఏకంగా చంద్రుడి విూదే అడుగుపెట్టాలని భావిస్తున్నది. ఆ దిశగా డ్రాగన్‌ దేశం ప్రయోగాలు కొనసాగిస్తున్నది. మార్స్‌ గ్రహం విూద రోవర్‌ కూడా దించేందుకు ఆ దేశం ఆలోచిస్తున్నది. జపాన్‌ కూడా మూన్‌ లక్ష్యంగా ప్రయోగాలను నిర్వహిస్తున్నది.  చిన్న చిన్న రాకెట్‌ ప్రయోగాలతో జాక్సా కూడా ఆసియా స్పేస్‌ రేసులో మందడుగు వేస్తున్నది. ఏదేమైనా ఇస్రో సృష్టించిన విప్లవం ఆసియా దేశాల్లో అంతరిక్ష పరిశోధనల మధ్య పోటీతత్వానికి దారితీసింది. పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీలు ఇస్రోకు అండదండగా మారాయి. అవే మన గగన కీర్తిని చాటుతున్నాయి.