అంతర్జాతీయ విమానాలపై 30 వరకు ఆంక్షలు

దేశంలో పరిస్థితులు దృష్ట్యా మరోమారు నిర్ణయం
తాజాగా దేశంలో మరో 14 వేల కరోనా కేసులు నమోదు
న్యూఢల్లీి,అక్టోబర్‌30 (జనంసాక్షి) : కరోనా మహమ్మారి ప్రభావం అంతర్జాతీయ ప్రయాణలపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో.. అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని భారత్‌ మరోమారు పొడిగించింది. నవంబర్‌ 30వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగించినట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రకటించింది. అయితే, ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ ఆమోదించిన ప్రత్యేక విమానాలకు వర్తించదని తెలిపింది. కరోనా మహమ్మారితో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. గతంలో ఈ నిషేధాన్ని ఈ నెల 31 వరకు విధించగా, తాజాగా దీనిని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలావుంటే దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,60,470కి చేరాయి. ఇందులో 3,36,41,175 మంది కోలుకోగా, 1,61,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,57,740 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 7,722 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 471 మంది కరోనాకు బలయ్యారు. ఇక గత 24 గంటల్లో 13,543 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడగా, 549 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రికవరీ రేటు 98.19 శాతం ఉన్నదని, యాక్టివ్‌ కేసులు 0.47 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపింది.