అంతుపట్టని వ్యాధితో బాధపడే చిన్నారిని ఆదుకోండి
ఖమ్మం, అక్టోబర్ 18 : అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జి. మాధవి (12) అనే బాలికకు శరీరంలోని అన్ని అవయవాలను నుంచి రక్తం కారుతుంది. దీంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చారు. బ్రాహ్మణపల్లికి చెందిన జి.కోటయ్య కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి కూతురు మాధవి, ఒక కుమారుడు ఉన్నారు. మాధవి ఆరవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు నెలలుగా మాధవికి శరీరంలోని ప్రధాన అవయవాల నుంచి రక్తం కారుతోంది. దీంతో ఆమెను తల్లిదండ్రులు విజయవాడ, ఖమ్మం పట్టణాల్లోని ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు బాలికకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. ఇప్పటివరకు సుమారు 80 వేలు ఖర్చు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మాధవికి మాత్రం రక్తం కారుతుండడం తగ్గలేదు. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పరీక్ష చేసిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నీలోఫర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే కూలీ పనిచేసుకునే తాము అప్పులు చేసి 80 వేలు ఖర్చు చేశామని, తమ కుమార్తెను దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని మాధవి తల్లి మరియమ్మ వేడుకుంటోంది. మాధవి ప్రస్తుతం పిల్లల వార్డులో చికిత్స పొందుతుంది.