అందరికీ రుణమాఫీ జరిగితీరుతుంది


రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల
ఖమ్మం,ఆగస్టు 27  (జనం సాక్షి):  రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మరోమారు స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీపై కలెక్టరేట్‌ వద్ద రైతు సంఘాలు మంగళవారం ధర్నాకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడకు చేరుకున్నారు. ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘం నేతలకు రైతులకు రుణమాఫీపై స్పష్టతనిచ్చారు. ఆపై రైతులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహ పడొద్దన్నారు. కుటుంబ నిర్దారణ కానీ రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. రైతుల ఇంటి వద్దే కుటుంబ నిర్దారణ చేసి వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారన్నారు. బ్యాంకుల్లో మొత్తం 42 లక్షల రైతులు 31 వేల కోట్లు అప్పు ఉన్నారని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ 18 వేల కోట్ల రైతులు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడిరచారు. రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల రుణమాఫీపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామ న్నారు. గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీపై కాగ్‌ నివేదికలో వాస్తవాలు వెల్లడయ్యాయన్నారు. రైతులను గందరగోళం చేసే పనులు చేయొద్దని హితవుపలికారు. సీఎం రేవంత్‌ రెడ్డి వాగ్దానం చేసినట్లు 31 వేల కోట్లు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు.