అంబరాన్నంటిన సంబరం..

-శ్రీ నాగులమ్మ దేవాలయంలో సామ కొత్తల పండగ.

మంగపేట,సెప్టెంబర్4(జనంసాక్షి):-

మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీ నర్సాపురం గ్రామంలో వెలిసిన
మహిమాన్విత శ్రీ నాగులమ్మ అమ్మవారికి సామకొత్తల పండుగను ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా డోలి వాయిద్యాల నడుమ పూజారులు వడ్డెలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పండగను ప్రతి యేటా పుబ్బ కార్తె మొదటి ఆదివారంలో జరుపుకోవడం అనాదిగా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.ఈ పండుగలో భాగంగా శ్రీ నాగులమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎర్రమ్మ , సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, ఘడికమారాజు శ్రీ నాగులమ్మ గద్దెలను శుభ్రపరచి అమ్మవారికి సంబంధించిన కుండలను, ఆభరణాలను, పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో అలంకరించారు. తదనంతరం , సామలు, మొక్కజొన్నలు, కొర్రలు లతో ప్రత్యేకంగా పాయసం వండి శ్రీ నాగులమ్మ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వీటితోపాటు కొత్తగా పండిన కూరగాయలను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సామ కొత్తల పండగ లో ముఖ్య ఘట్టం “యెన్ను కట్టడం” ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవార్ల స్తంభాలకు యెన్నుగట్టి పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సామ కొత్తల పండగలో లక్ష్మీనరసాపురం, వాగోడ్డుగూడెం కన్నాయిగూడెం నుండి చుట్టుపక్కల ఉన్న ఆదివాసిలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్టు ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు బాడిశ నాగ రమేష్ , ఇర్ప నాగలక్ష్మి,రామకృష్ణ ,కొమరం గాయత్రి,పాపారావు బాడిష నవీన్, వడ్డెలు మడకం లక్ష్మయ్య, సోడి సత్యం,ఈసం సమ్మక్క, కట్టం సమ్మక్క, కుర్సం పుల్లయ్య, చౌలం భవాని, హేమలత, సుప్రజా గ్రామపెద్దలు కుర్సం విష్ణుమూర్తి, కారం సాంబయ్య బాడిశ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .