అంబాలాలో రైతుల అరెస్ట్..
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇటీవల వరదలతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగిన పలువురు రైతులను హర్యానాలోని అంబాలా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢల్లీికి సవిూపంలోని శంభూ సరిహద్దుల్లో రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని బస్సులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతుల నిరసన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి కింద పడిన రైతు మరణించిన మరునాడే రైతులు నిరసనకు దిగడం గమనార్హం. తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరుపక్షాల మధ్య ఘర్షణలో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి.శంభూ సరిహద్దుకు వెళ్లే మార్గంలో అడుగడుగునా భారీగా పోలీసులను మోహరించడంతోపాటు తనిఖీలు చేపట్టడంతో పలువురు రైతులు నిరసన ప్రదేశానికి చేరుకోలేకపోయారు. చండీగఢ్‌లో రైతులు వచ్చే మార్గంలో అడుగడుగునా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అంబాలా`చండీగఢ్ రోడ్డులో పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అనుక్షణం తనిఖీలు నిర్వహించడంతో రైతులు ముందుకెళ్లలేకపోయారు. రాజ్‌పురాలో నిరసన కారుల దాడుల నిరోధక వాహనాలు, సీసీటీవీ కెమెరాలను అమర్చారు.అంబాలా, కురుక్షేత్ర తదితర ప్రాంతాలతోపాటు పంజాబ్ లో పలు ప్రాంతాల్లో రైతు నాయకులను అరెస్ట్ చేశారు. అమ్రుత్ సర్, తరణ్ తరణ్ వంటి ప్రాంతాల్లో టోల్ ప్లాజాల వద్ద రైతులు నిరసనలకు దిగారు. అరెస్ట్ చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని చెరుకు రైతుల సంఘర్షణ సమితి, భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేశాయి. లేని పక్షంలో భారీ ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.భారతీయ కిసాన్ యూనియన్ నేత అధ్యక్షుడు అమర్జిత్ సింగ్ మొహ్రీ, అంబాలా రైతు నేత షాహీద్ భగత్ సింగ్ తదితర రైతు నేతలను సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీతోపాటు భారతీ కిసాన్ యూనియన్ (క్రాంతి కారీ), బీకేయూ (ఏక్తా ఆజాద్), ఆజాద్ కిసాన్ కమిటీ, బీకేయూ (బీహ్రమ్కే), భూమి బచావో మొహిం తదితర 16 రైతు సంఘాలతో కూడిన కమిటీ వర్షాలతో భారీ పంట నష్టం జరిగిందన్నారు రైతు నేతలు. పంజాబ్ తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట దెబ్బ తిన్న రైతులకు ఎకరాకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం రూ.5000 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న ఇంటికి, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు కేటాయించాలన్నారు.