అకాల వర్షాలకు వణుకుతన్న గ్రామాలు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
పంటనష్టాలపై అంచనాల్లో అధికారులు
హైదరాబాద్,జనవరి27(జనంసాక్షి): అకాఅ వర్షాలకు తెలంగాణ జిల్లాలు సిమ్లాలా వణుకుతున్నాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. వైద్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. రెండు రోజులుగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల ఉరుములతోకూడిన వానలు పడుతున్నాయి. మరో 24 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో సోమవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశమున్నదని పేర్కొన్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. హిందూ మహాసముద్రంలో అండమాన్ నికోబార్ విూదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలంగాణపై నామమాత్రంగానే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రాయలసీమ, మహబూబ్‌నగర్‌లో తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్‌లో శనివారం రాత్రినుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను సంసిద్ధంచేశారు. 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో పనిచేయాలని కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షంతో రైతన్న చేతికందివస్తున్న యాసంగి పంట దెబ్బతిన్నది. రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వాన జనజీవనంపై తీవ్ర ప్రభావంచూపింది. ప్రధానంగా మిర్చి, పత్తి, మక్కజొన్న, కందులు, వేరుశనగ పంటలు నీటిలో మునిగిపోయాయి. పలు జిల్లాల్లో మార్కెట్ యార్డ్‌లకు అమ్మకానికి వచ్చిన దిగుబడి కూడా తడిసిముద్దయింది. పలుమండలాల్లో ఎడతెరపిలేకుండా కురిసిన వానలకు మక్కజొన్న పంట నష్టపోయింది.మిర్చిపంట తీవ్రంగా నష్టపోగా మామిడిపూత పెద్ద ఎత్తున రాలిపోయింది. కందులు నీటమునిగాయి. వేరుశనగపంట పూర్తిగా దెబ్బతిన్నది. చేనువిూదున్న పత్తి నష్టపోయింది. అకాలవర్షంతో పత్తికాయలు తడిసిపోయి పనికిరాకుండాపోయాయి. అక్కడక్కడా ఏరి ఆరబోసిన మిర్చి పంట తడిసిపోయింది. వరంగల్ గ్రావిూణ జిల్లాలోని 14 మండలాల్లోనూ అకాల వర్షంతో మిర్చి, మక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వేల ఎకరాల్లో సాగుచేసిన మిర్చి పంట వానల్లో తడిసి నానిపోయింది. పలుచోట్ల కళ్లాల్లో ఆరబోసిన మిర్చి వానకు కొట్టుకుపోయింది. మిర్చి, పుచ్చతోటలు దెబ్బతిన్నాయి.