అక్కడ ఉగ్రవాదుల క్యాంప్‌లు లేవు!
– విచారణలో తేలినట్లు స్పష్టంచేసిన పాక్
ఇస్లామాబాద్, మార్చి28(జనంసాక్షి) : పుల్వామా దాడికి సంబంధించి భారత్ తమకిచ్చిన 22 లొకేషన్లలో ఉగ్రవాదుల క్యాంప్‌లు లేవని పాకిస్థాన్ గురువారం చెప్పింది. అంతేకాదు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న 54 మందికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని తమ విచారణలో తేలినట్లు పాక్ స్పష్టం చేసింది. విూరు కోరితే ఆ 22 ప్రదేశాలకు స్వయంగా తీసుకెళ్లి చూపిస్తామని పాక్ విదేశాంగ శాఖ చెప్పింది. తమ విచారణకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే భారత్‌తో పాకిస్థాన్ పంచుకుంది. పుల్వామా దాడి పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థ పనే అంటూ ఫిబ్రవరి 27న పాకిస్థాన్ హై కమిషనర్‌కు కీలకమైన పత్రాలను అందించింది. ఆ వెంటనే తాము విచారణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని, పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్ సమర్పించిన పత్రాల్లో సోషల్ విూడియాకు చెందిన సమాచారమే కీలకంగా ఉన్నదని, దీంతో దానిపైనా పూర్తి విచారణ జరిపినట్లు తెలిపింది. భారత్ మొత్తం 91 పేజీలు, ఆరు భాగాలుగా ఉన్న పత్రాలను పాకిస్థాన్‌కు అప్పగించింది. అందులో కేవలం రెండు, మూడు పార్టుల్లోనే పుల్వామా దాడికి సంబంధించిన సమాచారం ఉన్నదని, మిగతాదంతా సాధారణ ఆరోపణలేనని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ అందజేసిన పత్రాల్లో 22 ప్రదేశాలను చెబుతూ.. అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. అన్ని చోట్లా తాము విచారణ జరిపామని, ఎక్కడా ఎలాంటి క్యాంపులు లేవని పాక్ చెబుతున్నది. అన్ని వాట్సాప్, టెలిగ్రాం నంబర్లను కూడా కూడా క్షుణ్నంగా పరిశీలించినట్లు చెప్పింది.