అక్బరుద్దీన్ అరెస్టుకు వారెంటు జారీ
పాట్నా,అక్టోబర్7(జనంసాక్షి):
బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉద్రేకపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అరెస్ట్‌కు రంగం సిద్దం అయ్యింది. అతడిని అరెస్ట్ చేయాలని కిషన్‌గంజ్ ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. గత ఆదివారం ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్‌గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఈ క్రమంలో ఓవైసీ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని కిషన్‌గంజ్ ఎస్పీ రాజీవ్ రాజన్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. అక్బరుద్దీన్‌పై కేసు కూడా నమోదైంది. హైదరాబాద్ చంద్రాయణగుట్ట మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అక్టోబర్ 4న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని మజ్లిస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అక్కడి పోలీసులు నిర్ధారించాక, కేసు నమోదు చేసినట్లు కిషన్‌గంజ్ ఎస్పీ తెలిపారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశామని, అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అక్బర్ ప్రసంగం కొనసాగిందని, భారత దేశంపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎస్పీ తెలిపారు. అయితే అక్బర్‌ను ఎప్పుడు, ఎక్కడ అరెస్టు చేసేది స్పష్టంగా తెలియరాలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.