అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లు సీజ్ చేయాలి : కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 3 : ఇసుక రవాణాకు సంబంధించి ఏ విధమైన అనుమతులు ఇవ్వడం లేనందున అక్రమంగా ఇసుక తరలింపును నిరోధించడానికి గట్టి నిఘాను, ఆకస్మిక దాడులను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ క్రిస్టినా జడ్.చొంగ్తు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ఇసుకపై నూతన మార్గదర్శకాలను సంబంధించి ఇసుక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ప్రభుత్వ అవసరాలకు ఇసుక అవసరం ఉన్నందున రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయాలని, అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లను, టిప్పర్లను సీజ్ చేయాలని ఆర్‌డిఓలను ఆదేశించారు. నూతన మార్గదర్శకాలను అనుసరించి మైనింగ్, భూగర్భ శాఖ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా టీంలను నియమించుకొని డిసెంబర్ 22లోగా జిల్లాలో ఇసుక లభ్యమయ్యే రీచెస్‌ను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ హర్షవర్దన్, డిఆర్‌ఓ జగదీశ్వరాచారి, ఆర్‌డిఓలు హన్మంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శివలింగయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.