అక్రమంగా దాచిన కలప స్వాధీనం
కఠిన అటవీచట్టం కోసం కసరత్తు
ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం
ఆదిలాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టి) గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. కలప దుంగలు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి కలపను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కలప విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.16లక్షల వరకు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఇదిలావుంటే ఇప్పటివీరు చూసీచూడనట్లుగా ఉన్న పోలీసుసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు కలప స్మగ్లింగ్‌కు పాల్పడినా, విలువైన సంపదను కొల్లగొట్టినా, అటవీ భూమి కబ్జాచేసినా గరిష్ఠంగా ఒకరోజు నుంచి ఏడాది జైలుశిక్ష మాత్రమే విధించేలా చట్టాలు ఉన్నాయి. జరిమానా రూ.10 నుంచి రూ.రెండు వేలవరకే ఉండేది. ఇకపై అడవుల్లో చిన్న నేరం చేయాలన్నా భయపడేలా కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. ఏ కేసునైనా నాన్‌బెయిలబుల్ సెక్షన్ కింద నమోదుచేసి జైలుకు పంపేలా సెక్షన్లను మార్చారు. జరిమానాను పెద్దమొత్తంలో పెంచుతున్నారు. కనీసం జైలుశిక్ష మూడేండ్ల నుంచి పదేండ్ల వరకు ఉండేలా చట్టానికి పదునుపెడుతున్నారు. షెడ్యూల్ 3లో చేర్చిన టేకు, నల్లమద్ది, ఏగిస, చందనం వంటి చెట్లను నరికితే కనీసం మూడేండ్ల నుంచి గరిష్ఠంగా 14 ఏండ్ల వరకు శిక్ష పడనున్నది. నేరగాండ్లను అరెస్టుచేసి అక్రమ సంపదను సీజ్‌చేసే అధికారం పోలీసులతోపాటు అటవీ అధికారులకు ఉన్నది. అయితే నేరస్థులను ప్రాసిక్యూట్ చేసే అధికారం లేకపోవడంతో ఇబ్బందిగా పరిణమించడంతో.. కొత్త చట్టంలో ఆ అధికారాన్ని అటవీ అధికారులకు ఇవ్వాలని పేర్కొన్నట్టుగా సమాచారం. ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీలైతే ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.