అక్రమార్కుల “చెర” నుండి భూములను తిరిగి ఇప్పించండి..!
బడుగుల ఇనాం భూములపై వాలిన గద్దలు.
‘ధరణి”లో చొరబడి భూములు కొట్టేసిన వైనం.
బడుగుల భూములను నిర్ధారించిన అధికారులు నివేదిక.
ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ బాధిత రైతుల ఆవేదన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 15. (జనంసాక్షి) జిల్లాలో ధరణి పోర్టల్ దెబ్బకు భూముల వివాదాలు, అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. స్థానికంగా ఉండే అధికారులను మచ్చిక చేసుకుని ఇనాం భూములపై వాలిన కొందరు అక్రమార్కులు గద్దల్లా భూములను కొట్టేసిన ఘటనలు జిల్లాలో అనేకం జగినట్లు బాధితుల ఆరోపణల వల్ల స్పష్టమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన రజకులకు సంబంధించిన ఇనాం భూములను కొందరు అక్రమంగా ధరిణిలో చొరబడి భూములు కొట్టేసిన వైనంపై బాధితులు సంవత్సరాల తరబడి న్యాయం కోసం అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామం సర్వేనెంబర్ 172 లో 12.36 ఎకరాల భూమి సుంకరి ఇనాం కింద సుంకరి రాజయ్య కుటుంబాలకు ఉండేది. ప్రస్తుతం ఇనాం భూముల హక్కుదారులకు సంబంధించిన వారసులు సుద్దాల ప్రభాకర్ తో పాటు వారసులు కాస్తులో ఉండడమే కాక భూములో వ్యవసాయం కోసం బోరు సైతం వేయించారు. ఇదిలా ఉంటే గ్రామంలో ఉపాధి కష్టంగా మారడంతో ఇనాం భూమిల వారసులు బతుకు తెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకున్న ఇదే గ్రామానికి చెందిన కేతిరి చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, భూమయ్య అనే వ్యక్తులు తమ భూమిని కబ్జా చేసినట్లు తెలుసుకున్న బాధితులు అనేకమార్లు ఇళ్ళంతకుంట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో కలెక్టర్ సైతం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో పూర్తిస్థాయి విచారణ కోసం స్థానిక రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. విచారణ చేసిన తాసిల్దార్ తన నివేదికలో బాధితుల భూమి ఆక్రమణకు గురైనట్టు పేర్కొనడం గమనర్హం. పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలించిన క్రమంలో ఆక్రమణ అక్రమాలు స్పష్టమైనట్లు బాధితులు తెలిపారు. సర్వేనెంబర్ 172 లో 12 ఎకరాల 36 గుంటల ఇనాం భూమి సుద్దాల నాంపల్లి కుమారుల వారసులపేరుతో రికార్డుల్లో ఉంది. భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసి మొత్తం భూమిని ఆక్రమించి గోల్ మాల్ చేసి ధరణి లో తమ పేరు వచ్చేలా అక్ర మార్కులు తప్పుడు సమాచారం తో తమ భూములు అక్రమంగా లాగేసుకునే కుట్రలు చేసుకున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. తాసిల్దార్ ఇచ్చిన నివేదికలో పాహాని రికార్డుల్లో బాధితుల పేర్లపైనే భూములు ఉన్నట్లు తెలపడంగమనార్హం. ఇనాం భూములు క్రయవిక్రియలకు చేయరాదన్న నిబంధనలను సైతం మర్చిపోయిన అక్రమార్కులు ఏకంగా మొత్తం భూమిపై కన్నేసి ధరణిలో తమ పేరు వచ్చేలా చేసి ఆధారమైన భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అనేకమార్లు అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. అధికారులేమో న్యాయం తమ వైపు ఉన్న కోర్టుకెళ్లి తేల్చుకోమంటు చెప్పడం తో తాము అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నమంటు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు న్యాయం అందేలా చూసి భూములపై ఆధారపడిన తమ కుటుంబాలకు భూములు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ధరణీ వల్ల సమస్యల్లో కూరుకుపోయిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.