అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌

1

– పేదల పొట్టలు కొడితే ఊరుకోం

– అసెంబ్లీలో  రేషన్‌ డీలర్లను హెచ్చరించిన మంత్రి ఈటల

హైదరాబాద్‌,అక్టోబర్‌6(జనంసాక్షి):

బియ్యం సరఫరా విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేశామని ,ఇక మీదట కూడా కొనసాగిస్తామని పేదల పొట్ట కొడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నవంబర్‌, డిసెంబర్‌ నాటికి అందరికి రేషన్‌కార్డులు ఇస్తామన్నారు. అర్హులందరికీ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 89లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ పథకం వల్ల ఆర్థక భారం పడుతున్నా పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. శాసనసమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్థికమంత్రి ఈటల మాట్లాడుతూ… ఉచిత బియ్యం పథకం ద్వారా 2కోట్ల మందికి పైగా లబ్ది చేకూరుతోందన్నారు. 89 లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదని ఆర్థిక మంత్రితెలిపారు.  ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్న నేపథ్యంలో 2 కోట్ల 82 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం అందిస్తున్నామని చెప్పారు. పేదలకు కడుపు నిండ అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.  తండాల్లో రేషన్‌ షాపులు ఏర్పాటు చేసే విషయం ఆలోచిస్తున్నామని అన్నారు.  రేషన్‌ కార్డులకు పూర్తి స్థాయిలో ఆధార్‌ అనుసంధానం కాలేదని పేర్కొన్నారు. పేదల సొమ్ము పెద్దల పాలు కావొద్దన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉద్ఘాటించారు. ఇదిలావుంటే  నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 25,589 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించామన్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో ప్రభుత్వానికి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగాలపై మంత్రి  క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో 25వేల 529 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించినట్లు ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. వీరిని రెగ్యులరైజ్‌ చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇప్పటికే ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన అంశాలు చర్చించి రెగ్యులరైజ్‌ చేస్తామని హావిూనిచ్చారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో తమకు సంబంధం లేదన్నారు.