అక్షరాలా లక్ష ఇళ్లు
– ఫోటోలతో సహా ప్రదర్శిస్తాం
– రాద్ధాంతం వద్దు
– విపక్షాలకు మంత్రి కేటీఆర్ హితవు
హైదరాబాద్,అక్టోబరు 26(జనంసాక్షి):
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇళ్లులేని ప్రతీ ఒక్కరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చితీరుతామని, చెప్పినట్లే లక్ష ఇళ్లను అందజేసి తీరతామని వాటి సంబంధించిన ఇళ్ల ఫోటోలతో సహా ప్రదర్శిస్తామని, ఈ విషయంలో విపక్షాలు రాద్ధాతంచేయొద్దని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం జియగూడలోని అంబేడ్కర్ నగర్‌లో నిర్మించిన 840 డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆయన
ప్రారంభించారు. అక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా అని అన్నది సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా నిరుపేద ఆడపిల్లల వివాహాలకు లక్షా నూట పదహారు రూపాయాలు అందిస్తున్నామని తెలిపారు. పేదవారికి ఒక మేనమామల కేసీఆర్ ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా.. బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించి ఇస్తున్నామని తెలిపారు. పండుగ వాతావరణంలో గృహా ప్రవేశాలు జరుపుకుంటున్నాం. నగరం మొత్తంలో లక్ష డబుల్ బెడ్‌రూంలు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ జియగడూ, గోడె కి కబర్, కట్టెలమండిలో కలిసి 1152 ఇండ్లు పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు. నగరంలోని నిరుపేదలకు దశల వారీగా ఇండ్లను అందజేస్తాం. 1985లో ఎన్టీ రామారావు హయాంలో బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లు అగ్గిపెట్టె, డబ్బా ఇండ్లు. ఈ 35 ఏండ్లు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు 45 లక్షలు మాత్రమే. ఒక వేళ వారు ఇండ్లు ఇస్తే రాష్ట్రంలో పేదోడు ఉండొద్దు. ఏడేండ్ల కింద పరకాల నియోజకవర్గంలో వరికోలు గ్రామానికి వెళ్లాను. 550 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. కానీ అక్కడ ఐదు ఇండ్లు కూడా లేవు. ఇల్లు కట్టకుండానే కట్టినట్లు చూపించి డబ్బులు దండుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల విలువ చేసే ఇండ్లను కట్టించి ఇస్తుందన్నారు. ఇండ్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోరు. ఏ ఒక్కరికీ కూడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దు. కేవలం అధికారులు మాత్రమే పారదర్శకంగా ఇండ్ల పంపిణీ చేస్తారని తెలిపారు. అంబేద్కర్ నగర్‌లో అంగన్‌వాడీ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. లైబ్రరీ కూడా అవసరం కాబట్టి అది కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 75 వేల పైచిలుకు ఇండ్లు కడుతున్నాం. 18 వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతున్నాం. ఈ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 70 వేల కోట్లు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఆలస్యమైనా పర్వా లేదు కానీ.. నాణ్యతలో లోపం లేకుండా ఇండ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో మూసీ సుందరీకరణ పనులు చేపడుతామన్నారు. జియగూడ అంటే కబేళా ఫేమస్. కబేళాను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పూర్తయితే.. జియగూడకు కొత్త కళ వస్తుంది. సైంటిఫిక్‌గా కబేళాను నిర్మించి ఇస్తామన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత లేకపోతే ఎన్నో రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పారిశుధ్యం కూడా విూరే నిర్వహించుకోవాలి అని కేటీఆర్ సూచించారు.