అఖిల మెడిసిన్ చదువుకు కేటీఆర్ అభయం
` రామన్న భరోసాతో సాకారం కానున్న పేదింటి విద్యార్థిని కల
` పేదలకు ఉచిత వైద్యమందిస్తా:అఖిల
` ఎన్ని జన్మలెత్తిన కేటీఆర్ రుణం తీర్చుకోలేను
` ‘జనంసాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు
` నేడు ప్రగతిభవన్‌కు అఖిల
(జనంసాక్షి వార్తకు అపూర్వ స్పందన..)
హైదరాబాద్,ఫిబ్రవరి 13(జనంసాక్షి):తమది పేదప్రజల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల ఆర్థిక పరిస్థితిపై జనంసాక్షి ఓ మానవీయ కథనం ప్రచురించింది. దానికి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అఖిల వైద్యవిద్యకు తాము అండగా ఉంటామని, ఎంత ఖర్చయినా ముందుకెళ్లి చదవాలని కేటీఆర్ ప్రోత్సహించడం విశేషం. ఈ మేరకు కేటీఆర్ కార్యాలయం నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, సోమవారం ఉదయం ప్రగతిభవన్ లో వచ్చి కలవమన్నారని అఖిల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా జనంసాక్షి ప్రతినిధికి చెప్పారు. అఖిల ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో నాలుగు వేల ర్యాంకుతో ఎంబీబీఎస్ కు అర్హత సాధించింది. అయితే ఈ నెల 14 తేదీ లోగా అడ్మిషన్ కోసం లక్ష రూపాయలు చెల్లిస్తేనే సీటు కన్ఫామ్ అవుతుందంటున్నారు. ఐదేళ్ల ఎంబీబీఎస్ కోసం సుమారు 15 లక్షలు ఖర్చవుతుంది. అడ్మిషన్ ఫీజు కట్టే స్తోమతే లేని తన తల్లిదండ్రులు ఇక డాక్టర్ కోర్సు ఎలా చదివిస్తారని వాపోతోంది. దీనిపై జనంసాక్షి మానవీయ కథనం ప్రచురించడంతో అది కాస్తా కేటీఆర్ దృష్టికి వెళ్లి అఖిల భవిష్యత్తుకు భరోసా కల్పించింది. అటు అఖిల తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.