విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించినందుకు నేడు, రేపు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు.. కేటీఆర్
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.18500 కోట్ల భారం పడకుండా ఆపినందుకు విజయ సూచికగా ఈ సంబురాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు జరపాలని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పది నెలల కాలంలోనే 18500 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందని కేటీఆర్ అన్నారు. ప్రజలపై విద్యుత్ భారం మోపడాన్ని ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించామని తెలిపారు. పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని దీనిపై ఈఆర్సీపి ఒప్పించలిగామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదనలోని సహేతుకత, న్యాయాన్నిను ఈఆర్సీ గుర్తించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించిందని అన్నారు.
విద్యుత్ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించినందుకు ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు, సభ్యులు మనోహర్ రాజు, కృష్ణయ్యకు తెలంగాణ ప్రజల తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యుత్ చార్జీల పేరిట రూ. 18,500 కోట్ల అదనపు భారం ప్రజలపై మోపడాన్ని హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో నిర్వహించిన మూడు బహిరంగ విచారణలలో తాము తీవ్రంగా వ్యతిరేకించామని కేటీఆర్ తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అని కేటీఆర్ పేర్కొన్నారు.