తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్‌

అగ్రనేతల ప్రచారంతో కార్యకర్తల్లో ఉత్సాహం

నిరుద్యోగులు, యువత లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం
హైదరాబాద్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్‌ నెలకొంది. కాంగ్రెస్‌ అగ్రనేతలంతా ఇక్కడే మకాం వేసి ప్రచారం చేయడంతో గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, డికె శివకుమార్‌, సిద్దరామయ్య, భూపేంద్ర భగేల్‌ వంటి వారు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్లారు. ఇకపోతే రేవంత్‌ రెడ్డికూడా పిసిసి చీఫ్‌గా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ యూత్‌ను టార్గెట్‌ చేసింది. నిరుద్యోగులను అధికార బిఆర్‌ఎస్‌ మోసం చేసిందని, అవినీతిలో కెసిఆర్‌ కూరుకు పోయారని మిర్శలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నిరుద్యోగం లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని, రాష్టాన్న్రి కేసీఆర్‌ ఆగం పట్టించారని అగ్రేనేతలు  ప్రియాంక గాంధీ, రాహుల్‌ తమప్రచారంలో విమర్శలు ఎక్కుపెట్టారు. పోరాటాలు, త్యాగాలు, కాంగ్రెస్‌ సహకారంతో ఏర్పడిన తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని అన్నారు. గ్రూప్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించడంలో  కెసిఆర్‌ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని, ఎంతో కష్టపడి చదివిన స్టూడెంట్లు తరచూ పేపర్ల లీకేజీల వల్ల మానసికంగా కుంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సరిగ్గా జరగక, ఉద్యోగాలు రాక కొందరు ఆత్మహత్యకు పాల్పడితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని అవమానించేలా దుష్పచ్రారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను చీకటిలోకి నెట్టేస్తున్నదని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, కుంభ కోణాల
మూలంగానే క్వశ్చన్‌ పేపర్ల లీకేజీ జరిగింది. దేశానికి పట్టుకొమ్మలైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు.  ఉద్యోగాలు దొరకక వారంతా అల్లాడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కారు బడా బడా సంస్థలకు గులాము చేస్తూ పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కింది నుంచి పైస్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతున్నదని, బీఆర్‌ఎస్‌ పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. అభివృద్ధిలో కాదు.. నిరుద్యోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, కనీస రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఉమ్మడి ఎజెండాతో పనిచేస్తున్నాయని, అందులో ఏ పార్టీకి ఓటు వేసినా ఒక్కటేనన్న ప్రచారం కూడా బాగ ఆచేపట్టారు. దేశంలోని ఇతర రాష్టాల్లో 50 సీట్ల వరకు పోటీ చేసే ఎంఐఎం ఇక్కడ సొంత మిత్రుల కోసం కేవలం 9 స్థానాల్లోనే పోటీ చేస్తున్నదని విమర్శించారు. దొరల తెలంగాణ పోయి.. ప్రజల తెలంగాణ వచ్చే వరకు ప్రజలు పోరాటం కొనసాగించాలి. చేయి చేయి కలిపి..  చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ అభ్యర్థులను  గెలిపించాలన్న నినాదాన్ని బాగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ఇకపోతే సాగునీటి  ప్రాజెక్టుల కింద సేకరించిన భూభాదితులకు అండగా కూడా ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. రైతుల నుంచి భూములు సేకరించినా  ప్రభుత్వం సరైన పరిహారాలు ఇవ్వలేదు. రైతులు , పేదలు ఇబ్బందులు
పడుతుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎప్పుడూ నోరు తెరవ లేదు. ప్రజల పక్షాన పోరాటం చేయని ఇలాంటి ఎమ్మెల్యే అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ సక్రమంగా జరగడం లేదన్నారు.  తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే నడుస్తున్నాయని, ఓటర్లు ఆలోచించి విచక్షణతో ఓట్లు వేయాలని కోరారు.  కాంగ్రెస్‌ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందని, అందుకే ఆరు గ్యారంటీలను ప్రకటించిందని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామని స్పష్టం చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదల సమస్యలకు పరిష్కారం దొరకలేదని కేసీఆర్‌ కు బైబై చెప్పాలంటూ  ప్రజలతో ’బై బై కేసీఆర్‌’ అని పలుసభల్లో  అనిపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా బిజెపి నిర్ణయాలు చేస్తోందని, అవినీతిపై విమర్వలు వచ్చినా ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాలేదని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా నిరుద్యోగం, జాబ్‌ గ్యారెంటీ, ఆరు గ్యారెంటీలను బాగా ప్రచారం చేయడంతో నయా జోష్‌ కనిపిస్తోంది.