అగ్రరాజ్యం గజగజ

– వణికిస్తున్న ‘ఇర్మా’

వాషింగ్టన్‌ ,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): ఎవరూ ఊహించని విధంగా హరికేన్‌ ఇర్మా తన రూపాన్ని తీవ్రతను మారన్చుకుంటూ ఫ్లోరడాను

ముంచెత్తుతోంది. తుపాను తీవ్రత తగ్గి 3కి పడిపోయిందనుకున్న దశలో ఆదివారం ఉదయం తిరిగి నాలుగుగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఫ్లోరిడాను భీకర గాలులు ఆతలాకుతలం చేశాయి. సాయంత్రానికి టోర్నడోలు కూడా ఏర్పడే ప్రమాదముందని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్లోరిడా, తీర ప్రాంతాల్లో గంటకు 130 కి.విూ వేగంతో అత్యంత బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ధాటికి ఇండ్ల పైకప్పులు, రోడ్లవిూద పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలు.. కదిలిపోతున్నాయి. ఫ్లోరిడాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌లు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విధ్వంసకర తుఫాను ముంచుకొస్తోందని ట్రంప్‌ ట్విటర్‌లో ప్రజలను హెచ్చరించారు. ‘ఆస్తి పోతే.. మళ్లీ సంపాదించుకోవచ్చు.. కానీ ప్రాణాలు తిరిగిరావు. వారి భద్రత చాలా ముఖ్యం’ అని ట్రంప్‌ అధికారులకు హితవు పలికారు. వీలైనంత త్వరగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆయన సూచించారు.ఇర్మా ప్రభావంతో గంటకు 209 కిలోవిూటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. 25 సెంటీవిూటర్ల నుంచి 51 సెంటీవిూటర్ల మేరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మియామి తీర ప్రాంత ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. హరికేన్‌ ఇర్మా అగ్రరాజ్యం అమెరికా వైపు దూసుకొస్తుంది. మరి కాసేపట్లో ఫ్లోరిడా తీరాన్ని తాకనుంది. కనివినీ ఎరుగని రీతిలో ఇది బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు ఇప్పటికే ఫ్లోరిడాలోని మూడోవంతు ప్రజలను ఖాళీ చేయించారు. దాదాపు 6.3 మిలియన్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారు కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ సూచించారు. ఇప్పటికే దాదాపు 76వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

టోర్నడో

హరికేన్‌ ఇర్మా ఒకవైపు భయపెడుతుంటే.. ఫ్లోరిడాలోని బ్రోవర్డ్‌ కౌంటీలో అతిపెద్ద టోర్నడో చెలరేగింది. 15 అడుగుల ఎత్తులో గాలి.. సుళ్లు తిరిగుతూ.. భీతావహ పరిస్థితులను ఏర్పరిచింది. ఇంకా మరిన్ని టోర్నడోలు ఏర్పడే ప్రమాదం ఉండడంలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారలు చెబతున్నారు. ఇదిలావుంటే తీర ప్రాంతంలో కెరటాలు 8 నుంచి 12 అడుగులు ఎత్తులో విరుచుకుపడుతున్నాయి.