అజిత్‌ జోగి భార్యకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ నిరాకరణ

మండిపడ్డ రేణూ జోగి ..సోనియాకు లేఖ

రాయ్‌పూర్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి భార్య రేణు జోగికి కాంగ్రెస్‌ పార్టీ ఈసారి టికెట్‌ నిరాకరించడంతో ఆమె అగ్గివిూద గుగ్గిలం అయ్యారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తనకు సీటు కేటాయించకపోవడంపై ఆమె యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోటా నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన రేణుకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి టికెట్‌ ఇవ్వకుండా ఆమెకు బదులుగా పార్టీ విభోర్‌ సింగ్‌ను నిలబెట్టింది. తాను ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి తీరుతానని రేణు సోనియాకు రాసిన లేఖలో స్పష్టంచేశారు. తన భర్త పార్టీని వీడినప్పటి నుంచి ఇతర రాజకీయ పార్టీల నేతల నుంచి లోపల, బయట కూడా విమర్శలు ఎదుర్కుంటు న్నానని ఆమె లేఖలో వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో నమ్మకంగా పనిచేసిన సీనియర్‌ మహిళా నేత త్యాగాలను పార్టీ గుర్తించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కోటా నుంచి తాను ఎలాగైనా పోటీ చేస్తానని లేఖలో వెల్లడించారు. పోటీ చేయడానికి తర్వాత ఏం చేయబోతున్నది మాత్రం చెప్పలేదు. రేణు జోగి భర్త అజిత్‌ జోగి 2016లో కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌(జేసీసీ) పార్టీని స్థాపించారు.

కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లో అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఆఖరి జాబితాలోనూ చోటు దక్కకపోవడంతో రేణు జోగి నిన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తన కృషికి తగిన గుర్తింపు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. 90 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్‌

జరగనుంది. నవంబరు 12న తొలి విడత, నవంబరు 20న రెండో విడత పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2013ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో భాజపా 49 చోట్ల గెలవగా, కాంగ్రెస్‌ 39 స్థానాల్లో విజయం సాధించింది.