అటవిహక్కు పత్రాల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తిచేయాలి.

– మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్11(జనంసాక్షి)

అటవీ హక్కు పత్రాలకొరకు సమర్పించిన దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం వేగవంతంగా పరిశీలన చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అటవీ హక్కు పత్రాల పంపిణీ కొరకు చేపడుతున్న పరిశీలన కార్యక్రమంపై హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ అధ్యక్షతన  జిల్లా కలెక్టర్ లు, అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ హక్కు పత్రాలు కొరకు సమర్పించిన దరఖాస్తు పరిశీలన కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన చేస్తూ  పరిష్కరించిన దరఖాస్తుల ఆమోదం కొరకు గ్రామసభ తీర్మానం పొందాలన్నారు. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అటవీ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని మహబూబాబాద్ నుండి  డిసెంబర్ మొదటి వారంలో అర్హులైన వారికి అందజేయనున్నందున పరిశీలన ప్రక్రియ వేగవంతం గా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పరిశీలన కార్యక్రమం చేపట్టాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ  35వేలు అటవీ హక్కు పత్రాలకు దరఖాస్తు చేసుకున్నారని, 11వేలు మాత్రమే పరిశీలనలో ఉన్నాయని, అదనపు సిబ్బందితో పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టామని 10రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ సమస్యలను సమన్వయంతో పరిష్కరిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్ మాట్లాడుతూ ప్రణాళిక బద్ధం గా చేపట్టామని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, డేవిడ్, ఆర్డీఓలు కొమరయ్య, రమేష్, డి.ఆర్.డి.ఓ.సన్యాసయ్య, డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.