అటవీ స్మగ్లర్ల భరతం పడతాం
నిర్మల్,అక్టోబర్30(జనంసాక్షి):కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా కేంద్రీకరించామని జిల్లా అటవీ అధికారులు అన్నారు. అటవీశాఖ చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు, సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కలపను అక్రమంగా రవాణా చేయడంతో పాటు అడ్డుకునేందుకు వస్తున్న అటవీశాఖ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్న స్మగ్లర్లపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని జిల్లా అటవీ అధికారులు హెచ్చరించారు. అక్రమంగా కలపను రవాణా చేస్తున్నారని తమకు ముందస్తుగా సమాచారం అందిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి, తనఖీలను నిర్వహిస్తున్నా మని తెలిపారు. ఎంతవారైనా సరే ఉపేక్షించేదిలేదని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన అడవిని సంరక్షించడం అందరి బాధ్యత అని తెలిపారు. కవ్వాల్ టైగర్ జోన్ ఫారెస్ట్ ,అటవీ సంపదతో పాటు జంతు సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమన్నారు. ఆయా గ్రామాలకు చెందిన స్మగ్లర్ల పూర్తి వివరాలను సేకరించామని, వారి జాబితాను స్వయంగా ఎస్పీకి అందచేసి పీడీ యాక్టు కేసులు నమోదు చేయిస్తానని చెప్పారు. పోలీసులు లేని సమయంలో సిబ్బందిపై రాళ్లు, గొడ్డల్లు, కర్రలతో దాడులు చేస్తూ, ప్రభుత్వ వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లర్ల ఎత్తుగడలు, అడవుల్లో ఎదురవుతున్న సమస్యలను వారు వివరించారు.