అట్టహాసంగా నాగోబా జాతర

1
ఇంద్రవెల్లి,ఫిబ్రవరి 7(జనంసాక్షి): జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వెలసిన నాగోబా జాతర ఆదివారం ఉదయం మెస్రం వంశస్థుల పూజలతో ప్రారంభమైంది. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన కోడళ్లతో పాటు ఏడు దేవుళ్లకు చెందిన కోడళ్లను వరుస క్రమంలో నిలుచోబెట్టారు. ప్రధాన్‌ పిలిచిన వారికి మెస్రం వంశానికి చెందిన నాయక్‌ వాడి, పటేల్‌ వంశం వారు మట్టికుండలను అందజేశారు. అనంతరం మట్టి కుండలను తీసుకొని కిలోవిూటరు దూరంలోని మర్రి చెట్ల వద్ద గల పూజ నీటి బావి వద్దకు బయలుదేరారు. అక్కడి నుంచి నీటిని తీసుకొని వరుసక్రమంలో నాగోబా ఆలయం ప్రాంగణానికి చేరుకున్నారు. వారు తెచ్చిన నీటితో మెస్రం వంశం ఆడపడుచులు, అల్లుళ్లు భూమిపై పోసి మట్టిని తవ్వి పుట్టలను చేశారు. ఆడపడుచులు వేసిన పుట్టల పక్కనే మెస్రం కోడళ్లు పుట్టలు చేశారు. ఆడపడుచులు చేసిన పుట్టలు అయిదురోజులు పగలకుండా ఉంటే వచ్చే ఖరీఫ్‌ లో పంటలు బాగా పండుతాయని, అలాగే ఆదివాసులకు వర్షాకాలంలో వ్యాధులు రావని వారి నమ్మకం. వారు తయారు చేసిన పుట్టల వద్దకు నాగోబా దేవత పూజారి మెస్రం హన్మంత్‌రావు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెస్రం వంశం పటేల్‌ సతీమణి మట్టి ఉండలను ప్రత్యేకంగా తీసుకొని ఆలయంలో మరో ప్రత్యేక పుట్టను తయారు చేశారు. ఈ పుట్ట తయారీకి మెస్రం వంశం కోడళ్లు మట్టి ఉండలను తీసుకెళ్లి అందజేశారు. వీరు ఇలా పూజల్లో ఉండగా.. గంగాజలం తీసుకొచ్చి మర్రిచెట్ల వద్ద ఉన్న మెస్రం పెద్దలు నాగోబా ఆలయానికి సాయంత్రం 3 గంటలకు బయలుదేరారు. వచ్చిన వెంటనే గర్భగుడిలోకి ప్రవేశించి దేవతను దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెనకవైపు వెళ్లి తెచ్చిన గంగాజలాన్ని భూమికి తాకకుండా కర్రలపై ఉంచారు. అనంతరం పెర్సపేన్‌, బాన్‌దేవతలకు పూజలు చేశారు. అక్కడి నుంచి నైవేద్యం వండే గోవాడలకు వెళ్లి దేవతలకు పూజలు చేసి మొక్కుకున్నారు. రాత్రి 9.30 గంటలకు మెస్రం కోడళ్లు తెచ్చిన నీటితో ఆలయాన్ని శుద్ధిచేశారు. 10.15 గంగలకు గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. నవధాన్యాలతో వండిన నైవేద్యాన్ని దేవతకు సమర్పించి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశం పటేల్‌ వెంకట్‌రావు, పూజారి హన్మంతరావు, సర్దార్‌ తుకుడోజి, పేన్‌కొత్వాల్‌ తిరుపతి, మెస్రం వంశస్థులు పాల్గొన్నారు.