అడవి దొంగల పనిపట్టాల్సిందే
అడవుల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సిఎం కెసిఆర్ ఈ విషయంలో కఠింగా ఉండాలన్న నిర్ణయం కారణంగా కదలిక వస్తోంది. రాజు గట్టిగా ఉంటే కిందిస్థాయిలో ఫలితం కూడా సానుకూలంగా ఉంటుంది. ఎంతో ఆవేదన, ఆందోళనతో ఇంతకాలం వేచిచూసిన సిఎం కెసిఆర్ కఠినంగా తీసుకుంటున్న నిర్ణయాలు స్వాగతించాలి. ఆలస్యంగా అయినా అడవులను రక్షించుకోవాల్సిందే. ఇష్టం వచ్చినట్లుగా అడవుల నరికివేత కారణంగా వేల ఎకరాల అడవులు నాశనం అయ్యాయి. అడవులను నరుక్కోవడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే గాకుండా సర్వత్రా విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అడవులను, జంతువులను కాపడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. లేకుంటే గాలీ,నీరు కూడా దక్కదు. అడవి జంతువులను కూడా కాపడుకుంటే అడవులు కూడా పచ్చగా నిలబడతాయి. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించాలని, అడవుల నుంచి పూచికపుల్ల కూడా బయటికి పోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరించడం వల్ల ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. అటవీ ప్రాంత ప్రజలకు, పర్యావరణ ప్రియులకు ఇవి ఆనందిన్నిచ్చే నిర్ణయాలుగా చూడాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పూర్తిగా మదింపు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిర్ణయాలను కఠినంగా అమలు చేస్తేనే అటవీ రక్షణ సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుగుణంగా అటవీశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడం ద్వారా పాతుకుపోయిన అవినీతిని అంతం చేయాల్సి ఉంది. ఇంటిదొంగల పనిపడితే తప్ప ప్రక్షాళన సాగదు. ముఖ్యమంత్రి మరింత కఠినంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో అక్రమార్కుల మార్గాలను పూర్తిగా మూసివేయాల్సి ఉంది. అడవులను నాశనం చేస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా ఉరితీసినా పాపం లేదు. వారివల్ల మొత్తం పర్యావరణం దెబ్బతింటోంది. అడవుల్లో ఉన్న జంతువులు నాశనం అవుతున్నాయి. ఇకపోతే అడవి జంతువుల వేట కోసం బిగించిన విద్యుత్ కంచెల కారణంగా సామాన్యులు, జంతువుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. అడవులచుట్టూ పలు గ్రామాల్లో విద్యుత్తు తీగలతో జంతువుల వేటతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరహా వేటపై అటవీ, విద్యుత్తు, పోలీసు శాఖలు సమన్వయంతో దాడులు చేసి వీటిని ముందుగా నిరోధించాలి. ప్రస్తుతం కుశ్నపల్లి, నీల్వాయి రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్ద పులికి ముప్పు పొంచి ఉందని చెప్పవచ్చు. వాస్తవానికి అడవి పందులు, దుప్పులు జింకల కోసం ఈప్రాంత వేటగాళ్లు అడవిలో 11 కేవీ విద్యుత్తు తీగలకు వైర్లు తగిలించి వేటాడుతుంటారు. ఇలా అమర్చిన తీగలకు పశువులతో పాటు అడవులకు వెల్లే గిరిజనులు విద్యుద్ఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై మంచానికే పరిమితమయ్యారు. వాస్తవానికి అడవికి వంట చెరుకు కోసం ఇతర పనుల కోసం వెళ్ళే వారికి భూమిలో అమర్చిన తీగలు కనిపించక ప్రాణాలు వదులుతున్నారు. ఇలా అయిదేళ్ల వ్యవధిలో కనీసం 20 పశువులు, నలుగురు వ్యక్తులు ప్రమాదాలకు గురై బలయ్యారు. విద్యుత్తు తీగలను ప్రధాన లైనుకు తగిలించి భూమిలో కప్పిపెడుతూ అడవి లోపలివరకు తీసుకెళ్లి వదులుతారు. అడవిలో నడిచే వారికి కనిపించకుండా కాలుకు తగిలిందో ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. దీంతో జంతువులు వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి. ఇలా చేయడం వల్ల అటవీ ప్రాంతంలో దుప్పిలు, జింకలు, అడవి పందులు మృగ్యం అవుతున్నాయి. పట్టపగలే గుంపులు గుంపులుగా కనిపించే జంతువులు అంతరిస్తున్నాయి. వేటగాళ్లు వీటిని మట్టుపెట్టి మాంసంతో వ్యాపారం చేస్తున్నారు. వేటగాళ్లు అమర్చే తీగలకు పెద్దపులి బలిఅయ్యే అవకాశం లేకపోలేదు. పలు మార్లు పులి సంచరిస్తునున్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. పులులు వేటగాళ్ల ఉచ్చులో బలికాక ముందే
చర్యలు తీసుకోవాల్సిఉంది. వేటగాళ్ల బారి నుంచి పులిని రక్షించాలంటే అటవీ జంతువుల కోసం అమర్చే తీగలను తొలగించే ప్రయత్నం జరగాలి. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా పులులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అడవులు, వన్యప్రాణులను సంరక్షించాల్సిన క్షేత్రస్థాయి అధికారులు విధి నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్నారు. పులుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నిధులు మంజూరు చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా కవ్వాల్ పులుల అభయారణ్యం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్ని పులులు ఉన్నాయో కూడా అధికారులకు తెలియని పరిస్థితి ఉంది. నామమాత్రంగా అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన చేతులు దులుపుకొన్నారు. వేటగాళ్ల ఉచ్చులో నడుముకు తీగ బిగుసుకుని గాయంతో తిరుగుతున్న ఫల్గుణ పులి ఆచూకీని ఇప్పటికీ అధికారులు గుర్తించలేదు. వేటగాళ్లతో క్షేత్రస్థాయి అటవీ శాఖ అధికారులకు ఏమైన సంబంధాలు ఉన్నాయా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వన్యప్రాణులకు తరచూ వేటగాళ్లు ఉచ్చులు బిగిస్తున్న విషయం అధికారులకు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ పోయి అడవుల రక్షణ సజావుగా సాగాలంటే క్షేత్రస్థాయిలో కఠిన చర్యలకు ఉపక్రమించాలి. ఇంటిదొంగల పనిపట్టాలి. అసలు సిబ్బంది క్షేత్రస్థాయిలో లేకపోవడంతోనే వారికి సమాచారం తెలియడం లేదు. అడవుల్లోనే సిబ్బంది ఉండి పనిచేసేలా చేయాలి. జవాబుదారీతనం తీసుకుని రావాలి. అడవుల నుంచి విలువైన టేకు,మద్దిలాంటి కలప బయటకు ఎలా వెళుతున్నదీ అందరికీ తెలుసు. రాజకీయ నాయకుల ప్రమేయం కేడా ఇందులో ఉంది. ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా వ్యవహరిస్తే తప్ప సిఎం కెసిఆర్ నిర్ణయాలకు అనుగుణంగా అడవులు రక్షణ సజావుగా సాగదు.