అడవులను కాపాడుకుందాం రండి
గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాలు
అడవులు నరక్కుండా ముల్తానీలకు స్వయం ఉపాధి
ఆదిలాబాద్,ఫిబ్రవరి5(జనంసాక్షి): అడవుల సంరక్షణపై అధికారులు రంగంలోకి దిగారు. ముందుగా గ్రామస్థులను చైతన్యం చేస్తున్నారు. వారే రక్షకులగా ఉండాలని సూచిస్తున్నారు. అడవిలో పోడు వ్యవసాయం, కలప స్మగ్లింగ్ కోసం విలువైన చెట్లను నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను నరికివేస్తూ పోతే రాజస్థాన్ రాష్ట్రంలా చివరకి ఎడారులే మిగులుతాయన్నారు. అడవులను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అడవుల్లో సంచరించే జంతువులను వేట పేరుతో చంపుతున్నారని, జంతువులు కూడా స్నేహభావంతో మెదులుకుంటాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. అడవులను, అడవి జంతువులను సంరక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. అడవుల పరిస్థితి, ప్రభుత్వం చేపడతున్న చర్యలు, కలప స్మగ్లింగ్‌పై కొత్తగా వచ్చిన చట్టాలను గురించి డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి వివరించారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టి అడవులను కాపాడుకునేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో కలప అక్ర మ రవాణాను అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఆరు కొత్త చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సాయుధ పోలీసుల సహకారంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా కలప రవాణాకు అడ్డుకట్ట పడినట్లయింది. మూల్తానీలు కొన్ని సంవత్సరాలుగా చెట్లను నరికివేస్తూ కలపస్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు సామిల్ వ్యాపారులకు స్థానికులు లారీలు, వ్యాన్‌లలో కలపను తరలిస్తున్నారు. దట్టమైన అడవులు ఉండగా.. వీటిలో విలువైన టేకు
చెట్లు ఉన్నాయి. ఈ గ్రామాలకు చెందిన పలువురు కలప నరికివేత ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. వీరిలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. ముల్తానీలు చదువుకోకపోడవడంతో పాటు వారి పిల్లలను సైతం చదివించడానికి ఇష్టపడడం లేదు. దీంతో పిల్లలు పెద్దయిన తర్వాత తమ కుటుంబసభ్యులతో పాటు చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారు. ఫలితంగా దట్టమైన అడవులు అంతరించిపోతున్నాయి. అడవులు అంతరించి పోకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలూ తీ సుకుంటున్నారు. ఇందులో భాగంగా ముల్తానీలు నివసించే ఇచ్చోడ మండలం కేశవపట్నం, జోగిపేట, గుం డాల, ఎల్లమ్మగూడ ప్రజలు కలపను నరికివేయకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వ్యవసాయ, అటవీ, మైనార్టీ, విద్యాశాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యాక్రమాలు నిర్వహించనున్నారు. యువకులకు వృత్తి పరమైన శిక్షణ తాపీమేస్త్రీ, ఎలక్టీష్రి యన్, ప్లంబింగ్, వెల్డింగ్, కుట్టుశిక్షణ లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. వైద్య ఆరోగ్యశాఖ వారితో పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. నాలుగు గ్రామాల్లో వంద కుటుంబాలు వ్యవసాయ చేసుకుంటూ ఉపాధి పొందుతుండగా వారికి వ్యవసాయపరంగా అవసరమైన సహాయ, సహకారాలు అందించనున్నారు. ముల్తానీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా అడవుల సంరక్షణ జరుగుతుందని అధికారులు అంటున్నారు.