అడవుల్లోకి వెళితే కఠినచర్యలు

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  అడవులను నరికినా, అడవుల్లోకి ప్రవేశించిన కఠినచర్యలు తప్పవని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీవో వి.మంజుల హెచ్చరించారు. అడవి దగ్ధం కాకుండా తమ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ ప్రాంతాల్లో  ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఎక్కడైనా అడవి దగ్ధమైతే జీపీఆర్‌ఎస్‌ ద్వారా తమకు సమచారం అందుతుందని, వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకొని చర్యలు చేపడతారని అన్నారు. మేకలు, పశువుల కాపరులు గొడ్డలితో అడవిలోకి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పలుమార్లు పశువుల, మేకల కాపరులకు హెచ్చరికలు జారీ చేశామని అన్నారు. ఎవరైనా గ్రామాలలో అక్రమంగా కలపను తరలిస్తే తమకు సమాచారం అందించాలని, వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని ఆమె కోరారు. అదవుల రక్షణ ప్రజల బాధ్యత కూడా అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అడవులను రక్షించడంతో పాటు మొక్కలు నాటాలన్నారు. ఇకపోతే వేసవి సవిూపించడంతో ఎవరైన వ్యక్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి నిప్పంటిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.